తెలంగాణ రాష్ట్రంలో ఈసీ ఆదేశాల మేరకు తప్పించిన అధికారుల స్థానంలో కొత్తవారికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. విధుల నుండి తప్పించిన అధికారులకు ఎన్నికలు పూర్తయ్యేవరకు బాధ్యతలు కేటాయించొద్దని ఈసీ ఆదేశించింది.
హైదరాబాద్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణలో ఈ నెల మొదటి వారంలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటించింది.ఈ సమయంలో తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సుధీర్ఘకాలం పాటు ఒకే చోట పనిచేసే అధికారులతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కొందరి అధికారుల జాబితాను కాంగ్రెస్ నేతలు సీఈసీ బృందానికి అందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంగా రాష్ట్రంలో పలువురు అధికారులపై ఈసీ వేటేసింది. నలుగురు కలెక్టర్లు,13 మంది ఎస్పీలు, ముగ్గురు సీపీలను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.
also read:తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 13 మంది ఐపీఎస్ అధికారులపై ఈసీ ఆగ్రహం.. సీవీ ఆనంద్‌పైనా వేటు
undefined
ఈసీ ఆదేశాల నేపథ్యంలో బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి బాధ్యతలను అప్పగించింది.వరంగల్ ఇంచార్జీ సీపీగా మురళీధర్, నిజామాబాద్ ఇంచార్జీ సీపీగా జయరాం,సూర్యాపేట ఇంచార్జీ ఎస్పీగా నాగేశ్వరరావు,సంగారెడ్డి ఇంచార్జీ ఎస్పీగా ఆశోక్,కామారెడ్డి ఇంచార్జీ ఎస్పీగా నరసింహారెడ్డి, జగిత్యాల ఇంచార్జీ ఎస్పీగా ప్రభాకర్ రావు, మహబూబ్ నగర్ ఇంచార్జీ ఎస్పీగా రాములును నియమించింది ప్రభుత్వం.
నాగర్ కర్నూల్ ఇంచార్జీ ఎస్పీగా రామేశ్వర్,గద్వాల ఇంచార్జీ ఎస్పీగా రవి, మహబూబాబాద్ ఎస్పీగా చెన్నయ్య,నారాయణపేట ఎస్పీగా సత్యనారాయణ,భూపాలపల్లి ఎస్పీగా రాములును నియమించింది ప్రభుత్వం.
మరో వైపు హైద్రాబాద్ సీపీ ఆనంద్ స్థానంలో విక్రంసింగ్ మాన్, వరంగల్ కమిషనర్ రంగనాథ్ మిశ్రా స్థానంలో మురళీధర్ కు, నిజామాబాద్ స్థానంలో జయరామ్ కు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది.విధుల నుండి తప్పించిన అధికారులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని కూడ ఈసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికిసూచించింది.
గతంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడ రిటర్నింగ్ అధికారిపై అప్పట్లో ఈసీకి ఫిర్యాదు వెళ్లింది.ఈ విషయమై విచారణ నిర్వహించిన ఈసీ రిటర్నింగ్ అధికారిపై వేటేసింది. గుర్తు కేటాయింపు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఓ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఈసీ విచారణ నిర్వహించి రిటర్నింగ్ అధికారిపై వేటేసింది.