ఈటెల రాజేందర్ ఆలోచన: హుజూరాబాద్ బరిలో భార్య జమున?

By telugu teamFirst Published Jun 4, 2021, 12:00 PM IST
Highlights

టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన భార్య జమునను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయ్యే హుజూరాబాద్ శానససభ నియోజకవర్గంలో తన భార్య జమునను పోటీకి దించే ఆలోచనలో మాజీ మంత్రి ఈటెల ఉన్నట్లు చెబుతున్నారు. అధికార పార్టీ తన అన్ని వనరులను ఉపయోగించి హుజూరాబాద్ లో తన అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ స్థితిలో తన భార్య జమున ఓటమి పాలైనా కూడా తన రాజకీయ జీవితంపై పెద్దగా ప్రభావం పడదనే ఉద్దేశంతో ఆ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈటెల రాజేందర్ శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో తన భార్య జమునను బరిలోకి దింపి గెలిపించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కాగా, ఆయన ఈ నెల 8వ తేదీన బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాను, ప్రధాన కార్యదర్శి సంతోష్ ను కలిసి గురువారం హైదరాబాదు వచ్చారు. విమానాశ్రయంలో తాను బిజెపిలో చేరే విషయంపై ఆయన నోరు మెదపలేదు. అయితే, ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా బిజెపిలో చేరుతారని అంటున్నారు. 

Also Read: నాకే కాదు హరీష్ రావుకు కూడ టీఆర్ఎస్‌లో అవమానాలు: ఈటల రాజేందర్

శుక్రవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఈటెల రాజేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తనకు టీఆర్ఎస్ లో అవమానాలు జరిగాయని అన్నారు. తనకే కాకుండా మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు కూడా అవమానాలు జరిగాయని ఆయన చెప్పారు 

click me!