ఖబర్దార్ కేసీఆర్... నీ ఆటలు నా దగ్గర సాగవు: ఈటల రాజేందర్ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 30, 2021, 3:50 PM IST
Highlights

హుజూరాబాద్ ఎన్నిక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడమే కాదు ఏకంగా సీఎం కేసీఆర్ నే ఫాంహౌస్ నుండి బయటకు పరుగులు తీయించిందన్నారు మాజీ మంత్రి ఈటల. 

హుజురాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై మాజీ మంత్రి బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ కుట్ర దారుడు, మోసకాడు... ఆయనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజలమీద ప్రేమ లేదని ఈటల మండిపడ్డారు. 

జమ్మికుంటలో ఏర్పాటుచేసిన బీజేపీ నూతన కార్యాలయాన్ని ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అని ప్రజలు అంటున్నారన్నారు. వైద్యానికి బడ్జెట్ పెంచమని తాను మంత్రిగా ఉన్నప్పుడే అడిగానని... అలా చేస్తే ఎక్కడ తనకు క్రెడిబిలిటీ వస్తుందో అని బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు ప్రకటిస్తున్నారని అన్నారు. 

''హుజూరాబాద్ ఎన్నిక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఈ ఎన్నిక ఏకంగా సీఎం కేసీఆర్ నే ఫాంహౌస్ నుండి బయటకు పరుగులు తీయించింది. ప్రజల బాగోగులు పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవని భయాన్ని లేపింది'' అన్నారు. 

''తెలంగాణలో 85% బడుగు బలహీనర్గ ప్రజలే వున్నారు. వారిని సీఎం గత ఏడు సంవత్సరాలు మర్చిపోయారు. దళిత సీఎం దేవుడెరుగు ఉపముఖ్యమంత్రిని కూడా అర్దాంతరంగా తీసివేసి దళితులను అవమానపరిచాడు. 16 శాతం ఉన్నవారికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి 0.5 శాతం ఉన్నవారికి ఎన్ని పదవులు ఉన్నాయి. మాదిగ లు ఒక మంత్రి, మాలలు ఒక మంత్రి అర్హులు కాదా? సీఎం కార్యాలయంలో ఎంత మంది బడుగు బలహీన వర్గాల వారు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ జాతులు పనికిరావా?  ఈ జాతులకు ఆ నైపుణ్యం లేదు అని అవమానించిన వ్యక్తి కెసిఆర్. ఉద్యోగులు అందరూ సంఘాలు పెట్టుకుంటే అణచి వేసిన వ్యక్తి''  అని మండిపడ్డారు. 

read more  దళితుడికి న్యాయం చేయలేదు: కేసీఆర్ పై ఈటల ఫైర్

''భూపాలపల్లి కలెక్టర్ గా ఎంతో గొప్పగా పని చేసిన మురళినీ అక్కడినుండి తీసివేసి ఎక్కడో వేస్తే ఆయన పదవిని వదిలిపెట్టి పోయారు. ఇలా ఆయన్ను అవమానించారు. ప్రదీప్ చంద్రకి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, ఆయనకు ఇచ్చిన గౌరవం అది. కనీసం పదవీ విరమణ రోజు కూడా సీఎం వెళ్ళలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల డబ్బును టాంక్ బండ్ మీద విగ్రహాలు ఖర్చు చేస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదనా అని అడిగిన. కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''ధరణి పేరుతో మొన్న తీసుకు వచ్చిన చట్టం ఎన్నో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని మళ్లీ దొరలకు అప్పజెప్పిన వ్యక్తి కెసిఆర్. ఈ జాతి అభివృద్ధికి ఏడు సంవత్సరాలుగా ఏం చేశారు? మూడు ఎకరాల భూమి స్కీమ్ కోసమే తప్ప పేదల జీవితాలు బాగు చేయడానికి కాదు. డబుల్ బెడ్ రూం లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లోనే... అదికూడా సాగునీటి ప్రాజెక్టుల లో లబ్ధి పొందిన వారు మాత్రమే కట్టి ఇచ్చారు. మిగిలిన నియోజకవర్గాల్లో  నాలుగున్నర లక్షల్లో కట్టలేక పోతున్నారు'' అన్నారు. 

''ఇంటెలిజెన్స్ ప్రభాకర రావు చట్టానికి లోబడి పని చేస్తున్నవా? చుట్టానికి లోబడి పని చేస్తున్నవా? ఇంటిలిజెన్స్ పోలీసులా కాకుండా తెరాస కార్యకర్తలా పనిచేస్తావా. తెరాస కండువా కప్పుకొని పని చేసుకో..  కానీ ప్రజల డబ్బులు జీతంగా తీసుకొని ఇలా చేస్తే చూస్తూ ఊరుకోము. మిమ్మల్ని చూస్తుంటే ఇజ్జత్ పోతుంది.. ప్రజలు ఈసడించుకుంటున్నారు. ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు. కర్రు కాల్చి వాత పెడతారు'' అని హెచ్చరించారు. 

''సంపూర్ణ మెజారిటీ వచ్చిన తరువాత కూడా మంత్రి వర్గం ఏర్పాటు చేయని వ్యక్తి కెసిఆర్. నీడను చూసి భయపడింది మీరు. ఈ రాజ్యాంగం ఏంది... నేను ఒక్కడినే చక్రవర్తి లా అనుకున్నది మీరు. నేను కరోనా పేషంట్ల కోసం ప్రజల చుట్టూ తిరుగుతుంటే నువ్వు నా మీద కుట్ర చేశారు. అయినా నీ ఆటలు సాగవు. ఈటెల రాజేందర్ ను బొందుగ పిసకాలి, బొంద పెట్టాలి అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షాల వారిని కొనుక్కొని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. అలా చేయడం ప్రజాస్వామ్యం ను గౌరవించినట్లేనా? కెసిఆర్ కి కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. మంత్రిగా కాదు కనీసం మనిషిగా చూడమని కోరాం. ఈ రోజు ఏ మంత్రి అయితే నా మీద కుట్రలు చేస్తున్నాడో అతడి భార్యే గతంలో కెసిఆర్ ఫోటోను ఇంట్లోంచి బయటికి విసిరేసింది'' అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''ఈటెల రాజేందర్ కు సీఎం ద్రోహం చేశాడు అని ప్రజలందరూ అంటున్నారు. నీతిగా, నిజాయితగా, డబ్బులు పంచకుండ టీఆర్ఎస్ పోటీ చేస్తే నేను గెలిచినా రాజీనామా చేస్తా.. ధర్మంగా పోటీ చేస్తే హుజూరాబాద్ లో మా ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు'' అన్నారు ఈటల రాజేందర్.  


 

click me!