బీఆర్ఎస్ చేసింది ఇదే .. కట్టిన ఒక్క ప్రాజెక్టూ కూలిపోయింది, రెండు ఫాంహౌజ్‌లు మిగిలాయి : భట్టి విక్రమార్క

By Siva Kodati  |  First Published Dec 20, 2023, 7:37 PM IST

తెలంగాణ ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశానికి సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదని బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. 


తెలంగాణ ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశానికి సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారని అన్నారు. అందరినీ ఒప్పించే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని విక్రమార్క గుర్తుచేశారు. రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రమని ఆయన తెలిపారు. నిధులు ఎలా వచ్చాయి, ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలని విక్రమార్క చెప్పారు. దేశంతో తెలంగాణ పోటీపడాలనే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. సభ్యులంతా మంచి సూచనలు ఇచ్చారని.. ఆర్ధిక పరిస్ధితి ఓ వైపు, ప్రజల ఆకాంక్షలు మరోవైపు వున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. 

మన ముందు పెద్ద సవాల్ వుంది వుందని.. ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం వుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో చాలాసార్లు 20 శాతం కంటే ఎక్కువగా గ్యాప్ వుందని ఆయన వెల్లడించారు. ఏ బడ్జెట్‌లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ వుంటుందని భట్టి విక్రమార్క చెప్పారు. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బట్జెట్ లేదని.. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. రాజస్ధాన్‌లో బడ్జెట్ అంచనాలకంటే ఎక్కువ ఖర్చు చేశారని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర సంస్థలు ఏం తీసుకురాలేదని, వచ్చిన ఐటీఐఆర్‌ను పొగొట్టారని విక్రమార్క ధ్వజమెత్తారు.

Latest Videos

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారని ఆయన చురకలంటించారు. ఎన్నికల కంటే ముందే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిందని.. పదేళ్లలో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారని భట్టి ప్రశ్నించారు. మేం వెళ్లి మేడిగడ్డ చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారని, మేడిగడ్డను మళ్లీ కట్టాలని ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని విక్రమార్క తెలిపారు. రెండు ఫాంహౌజ్‌లను మాత్రం తెచ్చారని, మీరు కట్టిందే ఓ ప్రాజెక్ట్, అది కూడా కూలిపోయిందని భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. రాష్ట్రంపై మీకంటే మాకే ఎక్కువ ప్రేమ వుందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది తామేనని, దానిని కూడా మీరు వాడుతున్నారని భట్టి ఎద్దేవా చేశారు. 

కార్పోరేషన్‌లు అప్పులు తీర్చవని, ప్రభుత్వమే అప్పు తీర్చాలన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్ధితి వుందని.. తెచ్చిన అప్పులతో బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారా అంటే అదీ లేదన్నారు. ఆర్ధిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారని .. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ టాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంతచేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారని ఆయన మండిపడ్డారు. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారని.. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రమన్నారు. 

రాష్ట్రం ఏర్పడినప్పుడు 14 శాతం ఉన్న రుణభారం ఇప్పుడు 34 శాతానికి పెరిగిందని భట్టి తెలిపారు. ఓఆర్ఆర్ కట్టింది తామేనని, దానిని కూడా అమ్మకానికి పెట్టారని విక్రమార్క ఎద్దేవా చేశారు. బహిరంగ మార్కెట్ కంటే వడ్డీ ఎక్కువని, మీరు చేసిన దివాళ పని సెట్ చేసుకోవడం మాకు కష్టమేనని ఆయన పేర్కొన్నారు. 

ఆర్ధిక అరాచకత్వం ఎంతగా వుందంటే అప్పు కట్టడానికి కూడా అప్పు తేవాల్సిన పరిస్ధితి వుందన్నారు. ఏపీ కేడర్‌కు కేటాయించిన అధికారులను సీఎస్, డీజీపీలుగా చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. పాదయాత్ర చేసినప్పుడు అందరూ స్వేచ్ఛలేదనే చెప్పారని, పదేళ్లలో ఎప్పుడైనా సభలో ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. మాకు కిరీటాలు వచ్చాయని అనుకోవడం లేదని.. ఇప్పుడు కడియం శ్రీహరితో పాటు 4 కోట్ల మంది ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందన్నారు. 

తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అధికారం వచ్చినా మా వెన్నులో భయం పెట్టుకొనే పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఏనాడూ శత్రువులుగా చూడబోమని.. అధికారులందరితో మాట్లాడి శ్వేతపత్రం తయారుచేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. సర్వీస్‌లో వున్న అధికారులు నిష్ణాతులని వారితోనే శ్వేతపత్రం రూపొందించామని ఆయన పేర్కొన్నారు. 
 

click me!