తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీ దద్ధరిల్లింది. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారని.. తాము వాస్తవ పరిస్ధితులను ప్రజల ముందు వుంచే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటరిచ్చారు.
తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ నేపథ్యంలో విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటరిచ్చారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారని.. తాము వాస్తవ పరిస్ధితులను ప్రజల ముందు వుంచే ప్రయత్నం చేశామని చెప్పారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఆర్బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అవసరమైన చోట ఆర్బీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామని ఆయన చెప్పారు.
అంతకుముందు ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్ధీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ దీవాళా తీసిందని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దని, కేంద్రం కూడా అప్పులు చేసిందని ఒవైసీ గుర్తుచేశారు. ప్రభుత్వం ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రాన్ని ఎందుకు పెట్టిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది.. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది అని అక్బరుద్ధీన్ ప్రశ్నించారు. కర్ణాటక అప్పుల లెక్కలను ప్రస్తావించిన ఆయన.. రాంగ్ మెసేజ్ వెళ్లకూడదనేదే తన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఆర్బీఐ, కాగ్, బడ్జెట్ లెక్కలను అవసరానికి అనుకూలంగా వాడుకుంటున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు.
సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అప్పులు చేయడం తప్పు కాదని, కానీ ఆ సొమ్ము దేనికి ఖర్చు చేశామన్నదే ముఖ్యమన్నారు. మానవాభివృద్ధి కేంద్రంగా పాలన వుండాలని , ప్రజల బతుకుల బాగు కోసం అప్పులు చేయడంలో తప్పు లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అభివృద్ది వుండాలని, ఇప్పటికీ పోషకాహార లోపంతో పిల్లలు మరణిస్తున్నారని కూనంనేని చెప్పారు. కనీస అవసరాలైన కూడు, దుస్తులు దొరకని వారు ఇంకా వున్నారని ఆయన పేర్కొన్నారు.