కేసీఆర్, హరీష్ ఆదేశాల మేరకే..: అమిత్ షాకు రఘునందన్ రావు ఫిర్యాదు

By telugu teamFirst Published Oct 7, 2020, 5:18 PM IST
Highlights

తన, తన సిబ్బంది ఫోన్లను తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు

హైదరాబాద్: తన, తన సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ దుబ్బాక శాసనసభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఫిర్యాదు చేశారు. తేలంగాణ పోలీసు శాఖ ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బిజెపి అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు తరఫున చెరుకు శ్రీనివాస రెడ్డి పోటీ పడుతున్నారు. 

ఇటీవల శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బులు రఘునందన్ రావుకు చేరవేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ చెప్పిన విషయం తెలిసిందే. రఘునందన్ రావు పీఎ ఫోన్ సంభాషణ ఆధారంగా ఆ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు ఆమె తెలిపారు. 

ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు కనిపిస్తున్నారు. రూ.40 లక్షలు పట్టుబడిన సంఘటనలో రఘునందన్ రావును కూడా విచారిస్తామని పద్మజ చెప్పారు.

click me!