
మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత టిఆర్ఎస్ ఎంపి ధర్మపురి శ్రీనివాస్ బిజెపి తీర్థం పుచ్చుకునే సమయం దగ్గర పడ్డది. ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది. ఈనెల 20వ తేదీ కానీ లేదంటే సెప్టెంబరు 2వ తేదీ కానీ డిఎస్ బిజెపి గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా డిఎస్ బిజెపి గూటికి వెళ్లవచ్చని చెబుతున్నారు. డిఎస్ బిజెపిలోకి పోతే తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడం ఖాయమని చెబుతున్నారు.
డిఎస్ పార్టీ మార్పుపై రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతున్నది. డిఎస్ చిన్న కొడుకు అర్వింద్ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మోడీకి జైకొడుతూ పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు విడుదల చేసిండు. దీంతో డిఎస్ పార్టీ మార్పు అనివార్యమైందని తేలిపోయింది. అయితే నిన్నటి వరకు కూడా డిఎస్ తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని, వేరే పార్టీలోకి వెళ్లేది లేదంటూ ప్రకటనలు గుప్పించాడు. మరి అర్వింద్ ప్రకటనలు ఎందుకిచ్చాడని ప్రశ్నిస్తే ఆ మాట ఆయననే అడగాలంటూ డిఎస్ పేర్కొన్నారు. ఇక కొడుకు అర్వింద్ మాత్రం తనకు మోడీ అంటే అభిమానం కాబట్టే ప్రకటనలు ఇచ్చానని, పార్టీలో చేరతానా లేదా అన్నది ఇంకా తేల్చుకోలేదని చెప్పుకున్నారు. ఎంత అభిమానం ఉంటే మాత్రం అరకోటి ఖర్చు చేసి పేపర్ యాడ్స్ ఇస్తరా అని జనాల్లో చర్చ మొదలైంది.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనే డిఎస్ బిజెపి నేత అమిత్ షా ను కలిసినట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే పార్టీలో చేరే విషయం ఫైనల్ అయిందని, అప్పటి నుంచే డిఎస్ పై వార్తా కథనాలు మీడియాలో వచ్చాయని తెలుస్తోంది. తాను తెలంగాణలో పర్యటించే సందర్భంలో పార్టీలో జాయిన్ కావాలంటూ అమిత్ షా డిఎస్ కు సూచించినట్లు తెలుస్తోంది. డిఎస్ తోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను సైతం టిఆర్ఎస్ నుంచి తీసుకొస్తానని మాట ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక డిఎస్ పార్టీ మార్పుపై మీడియాలో ఎన్ని కథనాలొచ్చినా వాటిని మాత్రం డిఎస్ ఖండించడం లేదు. కాకపోతే ఒకే డైలాగ్ కొడుతున్నారు తాను టిఆర్ఎస్ లోనే ఉంటానంటూ తప్ప వేరే మాట్లాడడం లేదు. డిఎస్ పార్టీ మార్పుపై టిఆర్ఎస్ లోనూ చర్చ జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పార్టీ మారితే టిఆర్ఎస్ పట్ల జనాల్లో చర్చలు మరింతగా సాగే అవకాశం ఉందంటున్నారు. ఒక బిసి నేతగా ఉన్న డిఎస్ పార్టీలోకి వచ్చి టిఆర్ఎస్ కు మేలు చేకూర్చకపోయినా ఆయన వెళ్తే మాత్రం ఎంతో కొంత టిఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశముందని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇప్పటి వరకు తెలంగాణలో బలంగా ఉన్న టిఆర్ఎస్ లో ఎవరూ బయటకు వెళ్లలేదు. మరి డిఎస్ వెళ్తే ఆ పరంపర కొనసాగుతుందా? ఆగిపోతుందా చూడాల్సి ఉంది.