
తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే తెలంగాణ సర్కారు వారి నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్. లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించే అవకావమున్న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌వెస్టుమెంట్ రీజియన్ (ఐ.టి.ఐ.ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. బుధవారం నాడు ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐ.టి శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఎంతో శ్రమించి 18 శాఖల నుంచి అన్ని అనుమతులు సాధించినట్లు చెప్పారు. ప్రాథమికంగా, సాంకేతికంగా అన్ని పనులు పూర్తి చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల పొట్ట కొట్టిందని ఆయన విమర్శించారు.
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మంజూరయిన పథకాన్ని కొనసాగిస్తే ఆ పాలకులకు మంచి పేరు వస్తుందన్న అక్కస్సు కారణంగానే కేటిఆర్ ఇలా ఐ.టి.ఐ.ఆర్‌పై నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. 50 వేల ఎకరాలో 2.19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా హైదరాబాద్‌కు నాలుగు దిక్కులా ఐ.టి అభివృద్ది జరిగేలా ఎంతో ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఈ పథకాన్ని చేపడితే టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పాడు చేసిందని ఆయన విమర్శించారు. 2013లో ఈ పథకం కేంద్రం మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చిన టిఆర్ ఎస్ మూడేళ్ళు మత్తులో జోగి ఇప్పుడు కేంద్రానికి కేటిఆర్ లేఖ రాయడం నిరుద్యోగులను మోసం చేయడమేని అన్నారు.
15 లక్షల మంది సాంకేతిక నిపుణులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మరో 60 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించే ఎంతో గొప్ప పథకాన్ని టిఆర్ఎస్ నాశనం చేసిందని, దీనిపై టిఆర్ఎస్ పాలకులు మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. టిఆర్ ఎస్ నాయకులు కమీషన్లు దండిగా తెచ్చి పెట్టే మిషన్ భగీరథ పథకంలో పావు వంతు ఈ పథకానికి కేటాయిస్తే ఏటా ఏటా 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేవని, ఇంత దెబ్బతినడానికి కారణం కేటిఆర్ నిర్లక్ష్యమేనని ఆయన దుయ్యబట్టారు. కేంద్రానికి కేటిఆర్ రాసిన లేఖలో అనుమానాలున్నాయని, కేంద్రంపైన వత్తిడి చేసినట్టు లేదని, పథకం అటకెక్కినట్టేనా , మేము ప్రజలకు ఏమి చెప్పాలని భిక్షం అడిగినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.