సంగారెడ్డి జిల్లాలో దారుణం... ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన తాగుబోతు కొడుకు

Arun Kumar P   | Asianet News
Published : Jan 27, 2022, 10:04 AM ISTUpdated : Jan 27, 2022, 10:09 AM IST
సంగారెడ్డి జిల్లాలో దారుణం... ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన తాగుబోతు కొడుకు

సారాంశం

నవమాసాలు మోసి ప్రాణంపోసి... కంటికిరెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్దచేసిన కన్న తల్లినే అతి కిరాతకంగా కడతేర్చాడో తాగుబోతు తనయుడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

సంగారెడ్డి: అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే అన్నది అక్షరాలా నిజమని తాజాగా సంగారెడ్డి జిల్లా (sangareddy district)లో చోటుచేసుకున్న దారుణం మరోసారి నిరూపించింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే ఆస్తి కోసం ఓ తాగుబోతు తనయుడు అతి కిరాతకంగా హతమార్చాడు. అంతేకాదు తల్లిది సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. 

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పోతులబొగుడ (pothulaboguda) గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55) కొడుకు మురళి వద్ద వుంటోంది. అయితే భర్త చనిపోవడంతో అతడి పేరున వున్న నాలుగు ఎకరాల భూమి మల్లమ్మ పేరిట వుంది. అంతేకాదు ఆమె వద్ద చాలా బంగారు ఆభరాణాలు కూడా వున్నాయి. 

అయితే తల్లివద్ద వున్న భూమి, బంగారంపై తాగుబోతు కొడుకు కన్ను పడింది. భూమిని తన పేర రాయాలని, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలంటూ తాగివచ్చిన ప్రతిసారి తల్లితో గొడవకు దిగేవాడు మురళి. తన తదనంతరం ఆస్తులన్నీ నీకే దక్కుతాయని తల్లి చెప్పినా వినిపించుకోకుండా ఇప్పుడే వాటిని తనకు ఇవ్వాలని అడిగేవాడు. తాగుడుకు బానిసైన కొడుకు ఎక్కడ ఆస్తిని కరిగిస్తాడోనని ఆ తల్లి అతడికి అప్పగించేందుకు ససేమిరా అంది.  

దీంతో తల్లిపై కోపాన్ని పెంచుకున్న మురళికి దారుణానికి ఒడిగట్టాడు. తల్లి చనిపోతే ఎలాగూ ఆస్తి తనకే దక్కుతుందని భావించిన అతడు హత్యకు ప్లాన్ వేసాడు. ముందుగానే భార్యను పుట్టింటికి పంపించిన మురళి ఇంట్లో తల్లి ఒంటరిగా వున్న సమయంలో గొంతునులిమి చంపేసాడు. బుధవారం పట్టపగలే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.  

అనంతరం తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసాడు. అయితే  అతడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే రెప్పలా కాపాడుకుంటానంటూ వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడిన జీవిత భాగస్వామినే భర్త అతి కిరాతకంగా హతమార్చిన దారుణం నల్గొండ జిల్లాలో ఇటీవల వెలుగుచూసింది.  చెప్పినమాట వినకుండా కుటుంబంలో కలహాలు సృష్టిసోందని భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త గత శనివారం రాత్రి గొంతునులిమి హత్య చేసాడు. ఈ అమానుషం మిర్యాలగూడ(nalgonda district)లో చోటుచేసుకుంది.

మిర్యాలగూడ (miryalaguda) పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గూడపూరి దీపక్, స్రవంతి దంపతులు నివాసముండేవారు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహమవగా ఓ కొడుకు వున్నాడు. దీపక్ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇలా ఏళ్లుగా సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్దలు పెరిగి గొడవ పెద్దదవడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే భార్యభర్తల మధ్య గొడవ పోలీసులు, కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. 

స్రవంతి కొడుకుతో కలిసి మిర్యాలగూడలోనే వుండగా దీపక్ మాత్రం నకిరేకల్ లో తల్లితో కలిసి వుండసాగాడు. అయితే తన మాట వినకుండా గొడవపడటమే కాదు కోర్టుకెక్కడంమే దీపక్ భార్యపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను హతమార్చాలన్న దారుణ నిర్ణయానికి వచ్చాడు. 

గత శనివారం రాత్రి మిర్యాలగూడలో భార్యా, కొడుకు నివాసముంటున్న ఇంటికి వెళ్ళాడు దీపక్. ముందుగానే భార్యను హతమార్చాలని ప్లాన్ వేసుకుని వచ్చిన అతడు గొంతునులిమి చంపేసాడు. భార్య చనిపోయినట్లు నిర్దారించుకున్న దీపక్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.  


 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం