
న్యూఢిల్లీ: అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన స్టూడెంట్.. అక్రమ బిజినెస్ చేశాడు. చట్టం కళ్లుగప్పి అక్రమానికి తెరలేపాడు. 18 నుంచి 22 ఏళ్ల వయసులో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వ్యాపారానికి తెగబడ్డాడు. ఎవరూ అనుమానించకుండా డ్రగ్స్‌ను చాకొలేట్లలో కలిపి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ డ్రగ్స్‌ను అమ్మడానికి సోషల్ మీడియాను వినియోగించుకున్నాడు. అవెలేబుల్ ఎడిబుల్స్ అంటూ వ్యాపారం చేసేవాడు. అతని క్లయింట్లకు వీటి డెలివరీ కోసం ఉబర్, ర్యాపిడోలను ఉపయోగించుకున్నాడు. ఎడిబుల్ అనేది వారి డ్రగ్స్‌కు కోడ్ వర్డ్ అని హైదరాబాద్ పోలీసులు కనిపెట్టారు. ఈ డ్రగ్స్ అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు.
22 ఏళ్ల రిషి సంజయ్ మెహెతా అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఆయన తండ్రి హైదరాబాద్‌కు ఓ ఫార్మా యూనిట్ ఉన్నది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూడా. రిషి సంజయ్ మెహెతా హ్యాష్ ఆయిల్‌ను రా చాకొలేట్‌లో కలిపి వాటిని చాకొలేట్ బార్‌లుగా తయారు చేశాడు. వాటిని మార్కెట్ చేసుకోవడానికి సోషల్ మీడియా వేదికలను వినియోగించుకున్నట్టు పోలీసులు వివరించారు.
‘18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న యువత ఆయన క్లయింట్లు. తన డ్రగ్స్‌ను అడ్వర్టైజ్ చేసుకోవడానికి, క్లయింట్‌లతో కమ్యూనికేట్ చేసుకోవడానికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించుకున్నాడు. ఎడిబుల్ అనే కోడ్ వర్డ్‌తో వాటిని ప్రచారం చేసుకునేవాడు’ అని హైదరాబాద్ టాప్ కాప్ సీవీ ఆనంద్ తెలిపారు.
Also Read: డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్ అరెస్ట్.. గోవాలో మకాం వేసి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..
4 కిలోగ్రాముల చాకొలేట్‌ను 40 గ్రాముల హ్యాష్ ఆయిల్‌ను కలిపి 60 చాకొలేట్ బార్‌లు తయారు చేసినట్టు పోలీసులు వివరించారు. వీటిని రూ. 5000 నుంచి రూ. 1000ల ధరలతో అమ్మినననట్టు తెలిపారు. ఈ చాకొలేట్ బార్‌లను తిన్న తర్వాత వారు 6 నుంచి 7 గంటలు మత్తులోనే ఉండిపోతున్నారని పేర్కొన్నారు.
వారిని రిహాబిలిటేషన్ కేంద్రాలకు పంపిస్తామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలని, మొబైల్ ఫోన్‌లలో వారు ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలని సూచనలు చేశారు.