నేడు భద్రాచలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. సీపీఎం, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 10:39 AM IST
Highlights

శీతకాల విడిది కోసం హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేడు ద్రౌపది ముర్ము భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.

శీతకాల విడిది కోసం హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేడు ద్రౌపది ముర్ము భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రచాలం వెళ్లనున్నారు. భద్రాచలంలో సీతారాములను దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మరోవైపు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. జిల్లాలోని సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌లకు తరలిస్తున్నారు. 

రాష్ట్రపతి పర్యటన ఇలా.. 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ద్వారా భద్రాచలం సమీపంలో సారపాక‌కు చేరుకుంటారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె వెంట రానున్నారు. ఐటీసీ అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. సారపాక నుంచి భద్రాద్రి రామాలయంకు చేరుకుంటారు. సీతారాముల దర్శనం అనంతరం.. అక్కడ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం కింద పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆమె శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్‌కు చేరుకుని అక్కడ వనవాసి కళ్యాణ్ పరిషత్, తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జంజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభించనున్నారు.  కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో దాదాపు 2000 మంది పోలీసులను బందోబస్తు విధుల్లో మోహరించారు. రాష్ట్రపతి పర్యటించే సమయంలో భద్రాచలం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక, భద్రాచలంలో కార్యక్రమం ముగించిన అనంతరం తిరిగి సారపక చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది.. అక్కడి నుంచి రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 

click me!