
ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రజాస్వామ్యం, సభా సంప్రదాయాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేస్తున్నాయ్. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం కాకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేయటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి వ్యవహరించిన విధానం కూడా సిఎంకు నచ్చలేదట. నిజంగా ప్రతిపక్షాల వ్యవహారం ఆక్షేపణీయంగా ఉందని కెసిఆర్ అభిప్రాయపడటం క్యామిడీగా ఉంది. సభలో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష ఎంఎల్ఏలపై ఎందుకు చర్యలు తీసుకూకడదని హరీష్ తదితర మంత్రులను సిఎం గట్టిగా అడిగారట. నిజంగా సభా సంప్రదాయాలపై కెసిఆర్ కు ఎంత గౌరవమో.
ఒక్కసారిగా టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఘటనలను గుర్తుకు చేసుకుంటే బాగుంటుంది. అప్పట్లో కూడా ఇదే గవర్నర్ ప్రసంగిస్తున్నపుడు ఇప్పటి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, అప్పట్లో ఎంఎల్ఏ హరీష్ రావు ఏం చేసారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా అసెంబ్లీ బెంచీలను ఎక్కి మరీ గవర్నర్ చేతిలోని కాగితాలను లాక్కునేందుకు ప్రయత్నించలేదా? కొన్ని కాగితాలను లాక్కుని గవర్నర్ మొహం మీదే కొట్టలేదా? గవర్నర్ అన్నీ అసత్యాలే చదువుతున్నారని దాడికి ప్రయత్నించింది ఇదే హరీష్ కాదా? అప్పట్లో ఎంఎల్ఏ ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ లోక్ సత్తా ఎంఎల్ఏ జయప్రకాశ్ నారాయణపైన దాడి చేయలేదా? ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగ, అధికారంలోకి వస్తే ఇంకోలా. బాగానే ఉంది టిఆర్ఎస్ డబుల్ యాక్షన్.