
తెలంగాణ డిఎస్సీ కోసం టీచర్ అభ్యర్థులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా పాలకులు డిఎస్సీ వేయడంలేదు. కాకపోతే పదే పదే త్వరలో డిఎస్సీ అంటూ స్టేట్ మెంట్లు విడుదల చేస్తున్నారు అధికార పార్టీ పెద్దలు. దీంతో త్వరలో డిఎస్సీ అనగానే కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టి కొట్టి అభ్యర్థులు అలిసిపోయారు. లక్షలాది మంది నిరుద్యోగులు త్వరలో అనగానే వేలకు వేలు పోసి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. ఊరుగాని ఊరు హైదరాబాద్ వచ్చి హాస్టల్ ఫీజులు, కోచింగ్ ఫీజులు పెట్టి చదువుతున్నారు. తీరా త్వరలో అనేది పదే పదే రిపీట్ అవుతుడడంతో వారంతా ఉసూరుమంటున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో డిఎస్సీ పై తమ నిరసనను వివిధ రూపాల్లో తెలిపారు నిరుద్యోగ అభ్యర్థులు. సర్కారు తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టు పెట్టారు. కొత్తరకం జోకులు తయారు చేసి సర్కారు స్పందించేలా సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. అయినా ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఒకవైపు సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినా తెలంగాణ సర్కారులో ఏమాత్రం చలనం వచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వేలసంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీ జరగుతందేమోనన్న ఆశతో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ సర్కారు తీరు తీవ్ర నిరాశను మిగిల్చింది. మూడేళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ టీచర్ అభ్యర్థులు సరికొత్త నిరసన చర్యకు దిగారు. అదేమంటే త్వరలో డిఎస్సీ వద్దు సారూ అంటూ వారు కొత్త పోస్టును సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. తమకు డిఎస్సీకి బదులు బిఇడి, డిఇడి చేసిన నిరుద్యోగులైన తమకు గొర్రెలు, బర్రెలు, మేకలు, కోళ్లు, కోడిపిల్లలు ఇస్తే హాయిగా వాటిని పెంచుకుంటూ లక్షలకు లక్షలు సంపాదిస్తాం... టీచర్ ఉద్యోగాలేమీ అవసరం లేదు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
మరి తెలంగాణ సర్కారు ఈ నిరుద్యోగుల కోరిక తీరుస్తుందా లేదా అన్నది కాలమే చెప్పాలి. నిరుద్యోగుల పోస్టును కింద చూడొచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి