కొత్త ఇరకాటంలో ‘తెలంగాణ’ రేవంత్ రెడ్డి

Published : Oct 03, 2017, 12:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
కొత్త ఇరకాటంలో ‘తెలంగాణ’ రేవంత్ రెడ్డి

సారాంశం

కేసిఆర్ అనంత పర్యటనతో ఇరకాటం టిడిపి టిఆర్ఎస్ స్నేహంపై ఊహాగానాలు అంతర్మథనంలో రేవంత్

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నది. కానీ ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎవరూ నిలవలేకపోతున్నారు. అసలైన ప్రతిపక్ష నాయకుల జాబితాలో మాత్రం రేవంత్ రెడ్డి కీలక స్థానంలో ఉన్నారు. సిఎం కేసిఆర్ పై కేసిఆర్ భాష, యాసలోనే విరుచుకుపడడంలో రేవంత్ దిట్ట. ఒకదశలో సిఎం కేసిఆర్ వ్యూహాలకు అంతో ఇంతో ధీటుగా స్పందిస్తున్న నేతగా కూడా రేవంత్ నిలుస్తున్నారు. కానీ మిగతా కాంగ్రెస్, బిజెపితోపాటు ఇతర పార్టీలు కూడా కేసిఆర్ వ్యూహాలకు చిత్తవుతున్న దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి.

రేవంత్ కూడా అనేకసార్లు కేసిఆర్ వలలో చిక్కుకున్న దాఖలాలున్నాయి. కానీ కేసిఆర్ కు ధీటుగా ప్రతివ్యూహాలను పన్నుతూ రేవంత్ రాజకీయాల్లో నిలబడుతున్నారు. తాజాగా కేసిఆర్ విసిరిన మరో అస్త్రం రేవంత్ ను కొత్త ఇరకాటంలోకి నెట్టేసింది. అదేమంటే కేసిఆర్ అనంతపురంలో జరిగిన పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం పెళ్ళికి వెళ్లడం, అక్కడ చంద్రబాబు సహా టిడిపి ప్రముఖులతో అలింగనం చేసుకోవడం తెలిసిందే. దీనికితోడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డ పయ్యావుల కేశవ్ తో కేసిఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ అంశం రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది పక్కన పెడితే వారి ఇద్దరి ఏకాంత చర్చలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది ఎవరికి లాభం ఎవరికి నస్టం అన్నది తేలకపోయినా తెలంగాణలో కేసిఆర్ పై వ్యక్తిగతంగా మడమ తిప్పని పోరాటం చేస్తున్న రేవంత్ కు మాత్రం కచ్చితంగా ఇరకాటమేనని రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. అందుకే ఈనెల 1వ తేదీ తర్వాత రేవంత్ ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఆదివారం సాయంత్రం రేవంత్ మీడియా సమావేశం ఉందంటూ సమాచారం వచ్చింది కానీ రేవంత్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. కేసిఆర్ అనంతపురం పర్యటన, అక్కడ టిడిపి పెద్దలతో స్నేహం విషయంలో ఎలా రియాక్టు కావాలో ఇంకా తేల్చుకోలేకపోతున్నారు రేవంత్. అందుకే గత రెండు రోజులుగా మీడియాకు దూరంగానే ఉంటున్నారు.

చంద్రబాబు, కేసిఆర్ కలయిక చాలాసార్లు జరిగినా ఈసారి అనంతపురం వేదికగా జరిగిన కలయిక మాత్రం కొత్త కులాల స్నేహంగా మారిందన్న వాతావరణం నెలకొంది. తెలంగాణలో వెలమ కులస్థులు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ సంఖ్యా పరంగా చాలా తక్కువగా ఉన్నారు. అందుకే కొత్త స్నేహాన్ని వారు కోరుతున్న వాతావరణం ఉంది. దానిలోభాగంగానే కేసిఆర్ తన స్నేహితుడైన పరిటాల రవీంద్ర కొడుకు పెళ్లికి అనంతపురంలో జరిగినా ప్రత్యేక విమానంలో, హెలిక్యాప్టర్ లో వెళ్లి హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ టిడిపి నేతలైన తుమ్మల, ఎర్రబెల్లి దయాకర్ రావులను వెంట తీసుకుపోయారు. ఈ పరిణామాలు చూస్తే తెలంగాణలో కానీ ఎపిలో కానీ కమ్మ, వెలమ కులాల మధ్య స్నేహం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కులాల స్నేహం బలపడిందంటే అంతిమంగా పార్టీల స్నేహం కూడా ఉండనే ఉంటది కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీన్ని బట్టి రానున్న ఎన్నకల నాటికి తెలంగాణలో టిఆర్ఎస్, టిడిపి కలిసి పోటీ చేయవచ్చన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఆచరణలో అదే జరిగితే రేవంత్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

కారణాలేమైనా రేవంత్ కేసిఆర్ మధ్య వైరం రాజకీయపరమైనదే కాకుండా ఇతర రూపాల్లోనూ ఉంది. దానికి కారణాల విశ్లేషణ అవసరం లేకపోయినా వీరిద్దరి మధ్య వైరం పార్టీల వారీగా, కులాల వారీగానే కాక కుటుంబాల వారీగా కూడా ఉంది. ఉత్తర దక్షిణ తెలంగాణ వారీగా కూడా పులుముకున్నది. అందుకే పలుమార్లు గతంలో రేవంత్ ఉత్తర తెలంగాణవారి దౌర్జన్యాలు చెల్లంవంటూ కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. అలాగే రేవంత్ తన కుమార్తె పెళ్లి జరిగినా సిఎం కేసిఆర్ కు పెళ్లి కార్డు కూడా ఇవ్వలేదు. రాజకీయాల్లో వైరం సహజమైనా వ్యక్తిగత వైరం మాత్రం ఎవరూ కోరుకోరు. కానీ అనూహ్యంగా రేవంత్, కేసిఆర్ మధ్య వ్యక్తిగత వైరంతోపాటు అనేక రకాల విభేదాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టిడిపి, టిఆర్ఎస్ కలిసిపోయే, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే రేవంత్ దారెటు అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితులను చూస్తే ఆ ప్రయోగానికి రేవంత్ సుముఖం కాదని చెప్పవొచ్చు.

 ఇటీవల కాలంలో నల్లగొండ ఉప ఎన్నిక తీసుకొస్తామంటూ అధికార పార్టీ వైపు నుంచి వచ్చిన ఒక లీక్ రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అధికార పార్టీ వ్యూహాత్మకంగా లీక్ ఇచ్చినా ఈ విషయంలో మిగతా పార్టీల వైఖరి ఎలా ఉన్నా రేవంత్ మాత్రం చాకచక్యంగా అధికార పార్టీ వ్యూహాన్ని ఎదుర్కొన్నారు. నల్లగొండలో ఎన్నికలంటూ వస్తే తానే స్వంయగా బరిలోకి దిగుతున్నట్లు సంకేతాలిచ్చి అధికార పక్షం వ్యూహాన్ని చిత్తు చేశారు. దీంతో నల్లగొండ ఎన్నికల ముచ్చట మాట్లాడుడే బంద్ చేశారు టిఆర్ఎస్ నేతలు. కానీ నల్లగొండ ఉప ఎన్నిక ఇవాళ కాకపోయినా రేపు వచ్చినా అధికార పార్టీ అంత ఈజీగా ఈ వ్యూహాన్ని అమలు చేసే వాతవరణం లేకుండా డిస్టర్బ్ చేశారు రేవంత్.

కానీ తాజాగా కేసిఆర్ వేసిన కొత్త ఎత్తు మాత్రం రేవంత్ ను కచ్చితంగా ఇరకాటంలోకి నెట్టిందనే వాదన టిడిపి వర్గాల్లోనూ నెలకొంది. మరి ఈ ఎత్తును రేవంత్ ఎలా ఎదుర్కొంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/gSuUjA

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి