ఈటల 100 శాతం నిజమే చెప్పారు.. ఓటుకు నోటుపై రేవంత్ ప్రమాణం చేస్తారా?: డీకే అరుణ

By Sumanth KanukulaFirst Published Apr 22, 2023, 3:23 PM IST
Highlights

టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుమ్మడికాయల దొంగంటే రేవంత్‌ భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు.

టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యల్లో 100 శాతం నిజం ఉందని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలకు డబ్బులందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఆర్థికంగా సాయపడిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్  నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. గుమ్మడికాయల దొంగంటే రేవంత్‌ భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. రేవంత్ వాస్తవాలు  జీర్ణించుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి అనలేదా? అని  ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ఉప ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. ఓటుకు నోటుపై భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. 

Latest Videos

Also Read: బీజేపీలో ఈటల ఆశించింది జరగడం లేదు.. నేను కూడా భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళతాను: పాల్వాయి స్రవంతి


ఇక, మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు తెలంగాణ  రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే ఇందుకు సాక్ష్యాలు  అయితే తాను అందించలేనని చెప్పారు. కానీ ఇది వాస్తమని అందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలనీ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గానీ.. ఆ తర్వాత గానీ రెండు  పార్టీలు చేతులు కలుపుతాయని జోస్యం చెప్పారు. 

అయితే ఈటల రాజేందర్ కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్‌ నుంచి గానీ, కేసీఆర్‌ నుంచి గానీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల శ్రమను, వారి మద్దతును ఈటల రాజేందర్ అవమానించారని మండిపడ్డారు. రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ చర్చల ప్రమాణాలను దిగజార్చుతున్నాయని విమర్శించారు. 

Also Read: ఈటల వ్యాఖ్యల కలకలం.. వీహెచ్ కౌంటర్.. రేవంత్ సవాల్ మీద స్పందించని ఈటల..!

తాము ఎటువంటి డబ్బు తీసుకోలేదని  నిరూపించేందుకు చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ నుంచి తాము డబ్బు తీసుకున్నామని ఈటల కూడా ప్రమాణం చేయాలని అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటలకు సవాలు విసిరారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. అయితే రేవంత్ సవాలుపై ఈటల రాజేందర్ వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన వెలువడలేదు.
 

click me!