లోక్ సభ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఆయనకు ఆఫర్లు ఇచ్చినట్టు సమాచారం. నిజామాబాద్, జహీరాబాద్‌ల నుంచి పోటీ చేయాలని ఈ పార్టీలు ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
Dil Raju: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనను రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అప్రోచ్ అయినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నిజామాబాద్ నుంచి పోటీకి అవకాశం ఇస్తే.. బీజేపీ జహీరాబాద్‌ను ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఒక వేళ కాంగ్రెస్ ఆఫ్‌ను యాక్సెప్ట్ చేస్తే.. దిల్ రాజు నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ పై పోటీ చేయాల్సి ఉంటుంది. 2014, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఈ సారి బరిలో నిలవకపోవచ్చనే ప్రచారం ఉన్నది.
దిల్ రాజు పుట్టింది నిజామాబాద్‌లో.. ఇప్పుడు నిర్మాతగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటారు. కానీ, నిజామాబాద్ నుంచి సంబంధాలు మాత్రం బలంగానే కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన మేనల్లుడు అశిశ్ పెళ్లి సమయంలో రిసెప్షన్ కోసం నిజామాబాద్ నుంచి చాలా మందిని హైదరాబాద్‌కు రప్పించి మరీ విందు ఇచ్చారు. నిజామాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దిల్ రాజుకు కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు ప్రచారం ఉన్నది.
Also Read: KTR: తెలంగాణలో మోడీ వేవ్ లేదు.. : మాజీ మంత్రి కేటీఆర్
ఇక బీజేపీ ఆఫర్ అంగీకరిస్తే.. జహీరాబాద్ నుంచి ఆయన బరిలో నిలబడతారు. జహీరాబాద్ నుంచీ ఆయనకు మంచి కాంటాక్టులే ఉన్నాయి. దిల్ రాజుకు బీఆర్ఎస్ అధినాయకత్వంతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. కానీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి, ఆయన ఈ రెండు పార్టీల టికెట్లపైనే ఆలోచించవచ్చు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ పుచ్చుకుని నిజామాబాద్ బరిలో నిలబడే అవకాశాలు ఉన్నాయి.