తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ కేంద్రీకరించింది. పార్టీ పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో ఫోన్లో చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఆ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ను ఈ వ్యవహరాన్ని పరిష్కరించాలని ఆదేశించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ హైద్రాబాద్ కు రానున్నారు. పార్టీకి చెందిన ఇరు వర్గాల నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గానికి మధ్య పొసగడం లేదు. రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగలేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. వలస వచ్చిన నేతలకే పార్టీ కమిటీల్లో చోటు దక్కిందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పరిణామాలను ఎఐసీసీ కేంద్రీకరించింది. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ ఇంచార్జీగా పనిచేశారు. రాష్ట్రానికి చెందిన నేతలతో దిగ్విజయ్ సింగ్ తో సంబంధాలున్నాయి. దీంతో ఇవాళ పలువురు నేతలకు దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు. ఇవాళ సాయంత్రం పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి నివాసంలో సీనియర్లు భేటీ కావాల్సి ఉంది.ఈ భేటీని వాయిదా వేసుకోవాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.
సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కకు కూడా దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మల్లుభట్టి విక్రమార్కకు కూడా ఫోన్ చేశారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు. సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలతో కూడ దిగ్విజయ్ మాట్లాడారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ను సీనియర్లతో చర్చించాలని అధిష్టానం సూచించింది. దీంతో కోదండరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో మహేష్ గౌడ్ చర్చించారు. పార్టీ అధిష్టానం నుండి వచ్చిన సూచనలపై చర్చించారు.
also read:గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గంగా పార్టీ నేతల మధ్య చీలిక ఏర్పడింది. అయితే ఈ గ్యాప్ ఇలానే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో ఎఐసీసీ ఈ పరిణామాలపై ఫోకస్ పెట్టింది. నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గేతో మాణికం ఠాగూర్ చర్చించారు. రెండు గంటల పాటు ఖర్గేతో చర్చించిన తర్వాత ఠాగూర్ రాహుల్ గాంధీ చర్చించేందుకు రాజస్థాన్ వెళ్లారు.మరో వైపు తెలంగాణలో పార్టీ పరిణామాలను ప్రియాంక గాంధీ తెలుసుకున్నారు. ఎవరు ఏం మాట్లాడారనే విషయమై ప్రియాంక గాంధీ పార్టీ నేతల నుండి సమాచారం తీసుకున్నారు.