ఎవరినీ రాజీనామా కోరలేదు.. వాళ్లంతా మా ఫ్రెండ్స్, మా ఆవేదన ఇదే : భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Dec 20, 2022, 4:13 PM IST
Highlights

కొత్తగా వేసిన టీపీసీసీ కమిటీలు తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నుంచి వచ్చిన వారు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న సంక్షోభంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరినీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదన్నారు. వాళ్లంతా మా ఫ్రెండ్సేనని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అన్యాయం జరిగిందనేదే తమ వాదన అన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వారికి పదవులు వచ్చేయనేది తమ వాదన అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కమిటీలో నుంచి ఎవరినీ తొలగించాలని కూడా తాము చెప్పమన్నారు. 

ఇదిలావుండగా... టీపీసీసీ కమిటీల విషయంలో  ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు  ప్రాధాన్యత లేదని  సినియర్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీని వీడి కాంగ్రెస్ లో  చేరిన నేతలు ఈ నెల  18న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.  కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరంగా ఉన్నారు. అలాగే ఇవాళ  జరగాల్సిన సీనియర్ల సమావేశం వాయిదా పడింది. పార్టీలో  చోటు చేసుకున్న పరిణామాలను చక్కదిద్దేందుకుగాను  దిగ్విజయ్ సింగ్ ను ఎఐసీసీ  పరిశీలకుడిగా నియమించింది.  దిగ్విజయ్ సింగ్ సూచనతో సీనియర్లు  ఇవాళ సమావేశాన్ని వాయిదా వేశారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్,  దిగ్విజయ్ సింగ్ లు  రాష్ట్రానికి చెందిన  పలువురు పార్టీ నేతలతో ఇవాళ ఫోన్ లో మాట్లాడారు.   పార్టీలో చోటు  చేసుకున్న సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేశారు.  ఈ ఫోన్లతో సీనియర్లు కొంత చల్లబడ్డారు. 

Also REad: తెలంగాణ కాంగ్రెస్‌‌పై హైకమాండ్ ఫోకస్: రంగంలోకి దిగ్విజయ్ సింగ్

అంతకుముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నేత దిగ్విజయ్ సింగ్ అని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. హుజూరాబాద్ పరిణామాలు, తనపై వాడిన పదజాలంపై దిగ్విజయ్ సింగ్ విచారణ జరపాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. పార్టీ కోసం పనిచేసేవారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఢిల్లీ పెద్దల సూచనతో  కొంతకాలంగా సైలెంట్ గా  ఉన్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ లో  సీనియర్లకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై దిగ్విజయ్ సింగ్ విచారణ చేయాలని ... ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమన్నారు.

కాగా.. ఈ నెల  14వ తేదీన ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ వెంటనే 15న  ప్రధాని నరేంద్రమోడీతో  వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు విషయమై సీఎల్పీ నేత  మల్లుభట్టి విక్రమార్క నివాసంలో  కొందరు సీనియర్లు  సమావేశమయ్యారు.ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. త్వరలోనే కలుద్దామని వెంకట్ రెడ్డికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.  ఈ నెల  17న భట్టి నివాసంలో కాంగ్రెస్ సీనియర్లు  సమావేశమయ్యారు.ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు.  సీనియర్లు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని వెంకట్ రెడ్డి చెప్పారు. 
 

click me!