బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటన.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం చెప్పారంటే..?

By Sumanth Kanukula  |  First Published Nov 21, 2022, 11:49 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత, రాజకీయ వ్యాఖ్యలు టీఆర్ఎస్ క్యాడర్‌ను అసహనానికి గురిచేశాయని.. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. 
 


బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అరవింద్ చేసిన వ్యక్తిగత, రాజకీయ వ్యాఖ్యలు టీఆర్ఎస్ క్యాడర్‌ను అసహనానికి గురిచేశాయని.. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో బంజారాహిల్స్ పోలీసులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు సహా తొమ్మిది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలకు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే వారందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

‘‘కవితపై ఎంపీ అరవింద్ తన ప్రెస్‌మీట్‌లలో వ్యక్తిగతంగా, రాజకీయంగా పలుమార్లు విమర్శలు చేశారు. అరవింద్ వ్యాఖ్యలపై ఆందోళనకు గురైన నిందితులు ఆయన నివాసం వద్ద నిరసనకు దిగాలని యోచించారు. వారిని అడ్డుకునేందుకు అరవింద్ నివాసం వద్ద తగినంత మంది పోలీసులు లేకపోవడంతో నిందితులు ఇతర టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి అరవింద్ ఇంట్లోకి చొరబడ్డారు. తొలుత ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి రాళ్లు రువ్వారు. పూల కుండీలు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లోకి చొరబడి పూజ, గదుల్లోని వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు’’ అని పోలీసులు తెలిపారు. 

Latest Videos

పోలీసులు నిందితులపై అతిక్రమణ, బెదిరింపు, ఆస్తి నష్టం వంటి అభియోగాలను మోపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, మీడియాలో కూడా ప్రసారం చేయబడ్డాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలం నుంచి రెండు సిమెంట్‌ రాళ్లు, రెండు కర్రలు, రెండు టీఆర్‌ఎస్‌ జెండాలను స్వాదీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. 

click me!