
ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు తన వద్ద పనిచేస్తున్న సీపీఆర్వో ( ముఖ్యప్రజాసంబంధాల అధికారి) వనం జ్వాల నరసింహారావును త్వరలో తొలగించనున్నట్లు తెలిసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం ఓఎస్డీగా పనిచేస్తున్న దేశపతి శ్రీనివాస్ ను నియమిస్తారట.
సీపీఆర్వోగా వనం జ్వాల నరసింహారావు సరైన పనితీరు కనబర్చడం లేదని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండున్నరేళ్లుగా సీపీఆర్వోగా పనిచేస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాలపై మీడియాకు సరైన సమాచారం అందించడంలేదని, జర్నలిస్టులతో సఖ్యతగా వ్యవహరించడం లేదని ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా సచివాలయం వార్తలను కవర్ చేసే జర్నలిస్టులతో ఆయన దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయట. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ మీడియా సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేకపోవడం కూడా ఉద్వాసనకు మరో కారణమని తెలుస్తోంది.
కాగా, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వనం జ్వాల పీఆర్వోగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయనను ఇప్పటికే ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా కూడా నియమించింది.
వనం జ్వాల స్థానంలో త్వరలో దేశపతి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మంచి కవిగా, గాయకుడిగా గుర్తింపు పొందిన దేశపతి... తన కళ ద్వారా తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు దగ్గరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆయనను తన ఓఎస్డీ ( ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా నియమించుకున్నారు.