స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన డిప్యూటీ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2023, 1:11 PM IST
Highlights

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆనంద్‌కుమార్ రెడ్డి సస్పెండ్ వేటు పడింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈ  ఘటనకు సంబందించి ఆనంద్‌కుమార్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 

అయితే గురువారం రాత్రి ఆనంద్‌కుమార్ రెడ్డి, అతని స్నేహితుడు, అలియాబాద్‌లో హోటల్ నడుపుతున్న బాబు.. హైదరాబాద్ ప్లెజెంట్ వ్యాలీ ఆఫీసర్స్ క్వార్టర్స్‌కు వెళ్లారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఆనంద్‌కుమార్ రెడ్డి తన ఐడీ కార్డును చూపించాడు. లోనికి వెళ్లిన తర్వాత అతడు సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడు. తన ఇంటికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ తిన్న స్మితా సబర్వాల్.. అతడిని ఎందుకు వచ్చావని  ప్రశ్నించారు. అనంతరం ఆమె భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వారు ఆనంద్‌కుమార్ రెడ్డి, అతని స్నేహితుడు బాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. 

అయితే స్మితా సబర్వాల్‌తో సర్వీస్ సమస్యలపై చర్చించేందుకు తాను అక్కడికి వెళ్లానని ఆనంద్‌కుమార్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, వీరిపై అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. 

click me!