
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు చనిపోయారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీని కోసం ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
అయితే పరిస్థితి విషమించడంతో ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు అంత్యక్రియలను స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో నిర్వహించనున్నారు. దీని కోసం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు.
వెంకటేశ్వర్లు ఆయుర్వేద డాక్టర్ గా సేవలు అందించేవారు. ఆయన మరణ వార్త వినగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్క సారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆయన కూడా స్వగ్రామానికి బయలుదేరారు.