మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ ఫన్నీగా వుండే మనిషి. ఎంత సీరియస్ వాతావరణం వున్నా తన మాటలతో కూల్ చేసేస్తారు. తాజాగా అసెంబ్లీలో సీరియస్ చర్చ జరుగుతున్న సమయంలో ఫిబ్రవరి 14న సెలవు కావాలంటూ స్పీకర్ ను కోరారు మల్లన్న.
హైదరాబాద్ :తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్దంతో సభలో సీరియస్ వాతావరణం వుంది. ఇలాంటి సమయంలో అధ్యక్షా అంటూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైకిలేచారు. దీంతో ఆయన కూడా సభలో చర్చ జరుగుతున్న అంశంపై మాట్లాడతారని స్పీకర్, సభ్యులు భావించారు. కానీ మాజీ మంత్రి మాత్రం తనదైన స్టైల్లో స్పీకర్ ను రెండ్రోజులు సెలవులు అడుగుతూ సీరియస్ గా సాగుతున్న సభలో నవ్వులు పూయించారు.
ఫిబ్రవరి 14న అంటే ఈ బుధవారం వసంత పంచమి. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించిన రోజునే ఈ వసంత పంచమిగా జరపుకుంటారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో చిన్నారులకు అక్షరాభ్యాసంతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఈ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి స్పీకర్ ను కోరారు.
ఇక వసంత పంచమి, ఆ తర్వాతిరోజు అంటే ఫిబ్రవరి 15న మంచి మూహూర్తాలు వున్నాయి... కాబట్టి భారీగా పెళ్లిళ్లు పెట్టుకున్నారు. ఈ రెండ్రోజుల్లో ఏకంగా 26 వేళ పెళ్లిళ్లు వున్నాయని మల్లారెడ్డి తెలిపారు. కాబట్టి ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకూడదని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పీకర్ ను కోరారు. ఇది తన ఒక్కడి కోరిక కాదు సభ్యులందరి రిక్వెస్ట్ అంటూ అందరి తరపున సెలవు కోరారు మల్లారెడ్డి.
14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుకుంటున్నా - మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి pic.twitter.com/3kjk3KkVZg
— Telugu Scribe (@TeluguScribe)
మల్లారెడ్డి ఫిబ్రవరి 14న సెలవు కోరడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. ఆ రోజు వసంత పంచమి మాత్రమే కాదు లవర్స్ డే (ప్రేమికుల దినోత్సవం) కూడా. అందువల్లే ఆ రోజున అసెంబ్లీ నిర్వహించకూడదని మల్లారెడ్డి కోరడం ఎమ్మెల్యేల నవ్వులు కారణమయ్యింది. స్పీకర్ కూడా మల్లారెడ్డి మాటలకు చిన్నగా నవ్వుకుని సభను కొనసాగించారు.