ఢిల్లీ లిక్కర్ స్కామ్.. నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర ఉత్కంఠ..

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 9:37 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు కవితను విచారించనున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కవిత.. ఈ రోజు విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కవిత విచారణకు హాజరైన పక్షంలో.. ఆమె ఈడీ విచారణను ఏ విధంగా ఎదుర్కొనున్నారు? అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. 

ఇక, ఈ కేసుకు సంబంధించి కవిత.. తొలుత ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు సమన్లు  జారీ చేసిన.. కవిత ఆ రోజు విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివవరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. దీంతో భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకుని.. ఈడీ అడిగిన వివరాలను సమర్పించారు. ఆ తర్వాత కవిత హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు.

అయితే ఈడీ ఈ నెల 20 మరోసారి విచారణకు రావాల్సిందిగా కవితకు నోటీసులు జారీచేసింది. దీంతో కవిత ఆదివారం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కవితో పాటు మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, పలువురు సన్నిహితులు కూడా ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న వారు అక్కడ కేసీఆర్ నివాసంలో బస చేశారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆమె ఎలాంటి వైఖరి అవలంభిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 

click me!