
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. కవితతో పాటు వచ్చిన ఆమె భర్త అనిల్ కుమార్, లాయర్‌ను అధికారులు లోనికి అనుమతించలేదు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్న సమయంలో కవిత బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఇక, ఢిల్లీ స్కామ్ కేసులో ఇదివరకే కస్టడీలోకి తీసుకున్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఈడీ ఆఫీసు పరిసరాల్లో ఇతరులెవరినీ అనుమతించడం లేదు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీసు వద్దకు చేరుకోకుండా భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్ నివాసం వద్ద ఉద్రిక్తత..
ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో బస చేస్తున్న సంగతి తెలిసిందే. కవితకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి చేరుకన్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకుని కవితకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ రోజు ఉదయం కవిత ఈడీ ఆఫీసుకు బయలుదేరిన సమయంలో ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కవిత.. బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులను రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కామెంట్ చేశారు.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కోర్టు.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవిత బినామీనని పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండోస్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది.ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, ఏపీ వైఎస్ఆర్‌సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. దీని ఆధారంగా కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.
అయితే.. అరుణ్ రామచంద్ర పిళ్లై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. పిళ్లై మార్చి 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్న సంగతి తెలిసిందే.
మరోవైపు మనీస్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ లాబీపై పలు విషయాలను పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు , మాగుంట శ్రీనివాసులు రెడ్డికి 65 శాతం వాటా వుందని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ మొత్తం 9 జోనులను కైవసం చేసుకుందని.. ఢిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్‌లోనే జరిగిందని ఈడీ పేర్కొంది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కుట్ర జరిగిందని ఈడీ ప్రస్తావించింది.
ఇండో స్పిరిట్‌లో పెట్టుబడులపై రామచంద్రపిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చాడని.. ఇండో స్పిరిట్‌లో బినామీ పెట్టుబడులు వున్నట్లుగా పేర్కొన్నారని ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూప్‌కు సంబంధించిన లాబీని బుచ్చిబాబు చూస్తున్నాడని పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ100 కోట్లకు పైగా ముడుపులు వెళ్లాయని.. వైసీపీ ఎంపీ మాగుంటతో కలిసి సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ వ్యవహారంలో ఆప్ నేత విజయ్ నాయర్‌ది కీలకపాత్రని వెల్లడించింది. సౌత్ గ్రూప్ లాబీపై పలు విషయాలను ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ మొత్తం 9 జోన్లను కైవసం చేసుకుందని.. గోరంట్ల బుచ్చిబాబు హవాలా రూపంలో డబ్బులు ఢిల్లీకి తరలించారని వెల్లడించింది.
కవితకు 33 శాతం వాటా ఇస్తామని వీరు చాటింగ్ చేసుకున్నారని ఈడీ తెలిపింది. వీ పేరుతో విజయ్ నాయర్, మేడమ్ పేరుతో కవిత వ్యవహరించారని పేర్కొంది. Samee పేరుతో సమీర్ చాటింగ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది.