ఢిల్లీ లిక్కర్ స్కాం: బిల్డర్ శ్రీనివాసరావు నుండి కీలక సమాచారాన్ని సేకరించిన ఈడీ

By narsimha lodeFirst Published Sep 20, 2022, 11:19 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ లో ఈడీ అధికారులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.  బిల్డర్ శ్రీనివాసరావును విచారించిన సమయంలో కీలక సమాచారాన్ని సేకరించారు. అరుణ్ రామచంద్ర పిళ్లై తో శ్రీనివాసరావు సంభాషణను ఈడీ అధికారులు సేకరించారు. 

హైదరాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కాంలో  హైద్రాబాద్ కేంద్రంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బిల్డర్ శ్రీనివాసరావు  విచారణ సమయంలో ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు.

గత కొన్ని రోజులుగా ఈడీ అధికారులు హైద్రాబాద్ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ స్కాంపై సోదాలు చేస్తున్నారు.ఈ నెల 6,7 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ నెల 16 వ తేదీన ఈడీ అధికారులు సోదాలు చేశారు. 16 వతేదీన దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ లో ప్రముఖ ఆడిటర్ నివాసంలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేశారు..ఈ సమయంలో కీలక ఆధారాలను సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆడిటర్ నివాసంలో స్వాధీనం చేసుకున్న హర్డ్ డిస్క్ నుండి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు.ఈ సమాచారం ఆధారంగా నిన్న బిల్డర్ శ్రీనివాసరావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు  శ్రీనివాసరావును తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. 

సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్ర ప్రైవేట్ లిమిటెడ్, హైద్రాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీ, వరుణ్  సన్ షోరూమ్, గోల్డ్ స్టార్ మైన్స్, మినరల్స్ అనే సంస్థలను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారు.  లిక్కర్ స్కాం  విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅరుణ్ రామచంద్రపిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావు, అభిషేక్ రావు, సృజన్ రెడ్డిలకు  శ్రీనివాసరావు సంస్థల నుండే  విమాన టికెట్లు బుక్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో శ్రీనివాసరావు తో సంభాషణను కూడా ఈడీ అధికారులు సేకరించారు. ఈ విషయమై ఇద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నించారని కూడా ఈ  కథనం తెలిపింది. కోట్లాది రూపాయాల లావాదేవీలు శ్రీనివాసరావు ద్వారా జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఈ డబ్బులను ఎందుకు ఉపయోగించారనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని ఆ కథనం  తెలిపింది.  బిల్డర్ శ్రీనివాసరావు కంపెనీల నుండే ముడుపులు వెళ్లాయా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఈ కథనం వివరించింది.  

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: ట్రావెల్స్ సంస్థలో కీలక ఆధారాల సేకరణ

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై బీజేపీ నేతలు ఆప్ నేతలపై విమర్శలు చేశారు. తెలంగాణకు చెందిన అధికార పార్టీ నేతలకు కూడా ఈ విషయమై సంబంధం ఉందని ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు.ఈ ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. లిక్కర్ స్కాం  విషయమై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం కార్యాలయంలో , ఇంటిలో కూడా గతంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

click me!