ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈ డీ అధికారులు ఇవాళ పదిన్నర గంటల పాటు విచారించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. సోమవారం నాడు ఈడీ అధికారులు కవితను పదిన్నర గంటల పాటు విచారించారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత రాత్రి 9:10 గంటలకు ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చారు. రేపు కూడా ఈడీ విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు కోరారని సమాచారం. రేపు ఈడీ విచారణకు కవిత హాజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇవాళ సుధీర్ఘంగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 11వ తేదీన కవితను 9 గంటల పాటు విచారించారు. ఇవాళ కవితను ఈడీ అధికారులు పదిన్నర గంటలకు పైగా విచారించారు. ఈడీ కార్యాలయం నుండి కవిత నేరుగా తుగ్లక్ రోడ్డులో ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.
ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చొని విక్టరీ సింబల్ చూపించారు కవిత. కవిత కారు ఈడీ కార్యాలయం నుండి వెళ్లే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గుమ్మడికాయను కొట్టి దిష్టి తీశారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా కవిత ఈ నెల 19వ తేదీన ఢిల్లీకి చేరుకున్నారు. కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు.
ఇవాళ ఉదయం అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి కవితను విచారించారు. సాయంత్రం పూట సిసోడియా, అమిత్ ఆరోరాతో కలిపి కవితను విచారించారని సమాచారం. వాస్తవానికి కవిత ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలి. కానీ ఈ నెల 16 న కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈడీ అడిగిన సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా కవిత పంపారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: ఇంకా ఈడీ ఆఫీసులోనే కవిత, ఉత్కంఠ
ఈ నెల 24వ తేదీ వరకు సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు విచారణకు హాజరౌతానని కవిత ప్రకటించారు. కానీ ఈ నెల 20వ తేదీనే విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. దీంతో ఇవాళ కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.