బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ కస్టడీ మరో మూడు రోజుల పాటు కోర్టు పొడిగించింది.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది కోర్టు.ఈ మేరకు శనివారం నాడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 15వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కవితను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ అధికారులు. దీంతో వారం రోజుల పాటు కవితను కస్టడీకి ఇచ్చింది కోర్టు. అయితే ఇవాళ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపర్చారు. ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కల్వకుంట్ల కవిత కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. కవితను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే కోర్టు మాత్రం మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.
కోర్టులో విచారణకు హాజరైన సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు.తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈకేసు నమోదు చేశారన్నారు.ఈ కేసుపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.
కవిత బంధువుల ఇళ్లలో ఇవాళ హైద్రాబాద్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈడీ తరపు వాదనలను కవిత తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు.