అమానుషం... కరోనాతో ప్రభుత్వోద్యోగి మృతి, జేసిబిలో మృతదేహం తరలింపు

By Arun Kumar PFirst Published Aug 7, 2020, 1:32 PM IST
Highlights

కరోనాపై భయంతో ప్రభుత్వ సిబ్బంది అమానుషంగా వ్యవహరిస్తున్నారు. 

వరంగల్: కరోనాపై భయంతో ప్రభుత్వ సిబ్బంది అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మృతదేహాలను పిపిఈ కిట్లు ధరించి కూడా తాకడానికి ముందుకురావడం లేదు. ఈ క్రమంలోనే జేసిబిలతో మృతదేహాలను శ్మశానానికి తరలించి అదే వాహనంతో పూడ్చిపెడుతున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనే ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. 

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మిడిదొడ్డికి చెందిన ప్రసాద్ అనే ప్రభుత్వోద్యోగికి కరోనా సోకింది. దీంతో అతడు గత కొద్దిరోజులుగా కరోనా చికిత్స పొందాడు. అయితే వైరస్ తీవ్రత ఎక్కువయి తీవ్రమైన శ్వాస సమస్యతో మృతిచెందాడు.  

అయితే కరోనా కారణంగా మృతిచెందిన అతడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు వెనుకాడారు. దీంతో పంచాయితీ సిబ్బంది ఆ పని చేయాల్సి వచ్చింది. అయితే వారుకూడా మృతదేహాన్ని తాకకుండా జేసీబీతో శ్మశానానికి తరలించారు. పీపీఈ కిట్లు ఉన్నా మృతదేహాన్ని తరలించేందుకు పంచాయతీ సిబ్బంది వెనుకాడటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా కరోనా మృతదేహాలను ఖననం చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనేక ఘటనలు ఇప్పటికే బయటపడ్డా మార్పు రావడం లేదు.

read more  ప్రొక్లెయిన్‌తో మృతదేహం తరలింపు : కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్పందించి ఇందుకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయించారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని అన్నారు.  

 ముఖ్యమంత్రి జగన్ కూడా ట్విట్టర్ వేదికన ఇలా స్పందించారు. ''శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు'' అంటూ ట్వీట్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ 70ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. కాగా.. ఆయన అంత్యక్రియలకు బంధువులంతా వచ్చారు. ఆయన అనారోగ్యంతో చనిపోయాడని వారంతా భావించారు. ఈ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ లీల ఆదేశాల మేరకు మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించారు. 

అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్‌ కాల్‌ ద్వారా ట్రూనాట్‌ పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. మృతుడిది 13మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబసభ్యులే కరోనా అని తేలగానే శవాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీయడం గమనార్హం.

దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీలో మృతదేహాన్ని తరలిస్తున్న వీడియో విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అధికారులపై చర్యలు తీసుకున్నారు.
 

click me!