Dasoju Sravan:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తమ ప్రభుత్వం విఫలమై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dasoju Sravan:బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తరచుగా వాడుతున్న అభ్యంతరకర పదజాలాన్ని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. తెలంగాణకు రాష్ట్రావతరణ సాకారం చేసిన నాయకుడి పట్ల అగౌరవంగా ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. శనివారం నాడు విలేకరుల సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాల అమలులో తమ ప్రభుత్వం విఫలమై ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి పూనుకున్నారన్నారు.
రేవంత్ అనుభవిస్తున్నా అధికారం శాశ్వతంగా ఉండదనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన నుంచి ఆశించిన మర్యాద, మర్యాదలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసారి తన మొహం అద్దంలో చూసుకోవాలని, రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శని అని తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిలో అధికార అహంకారం కనిపిస్తోందని, తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణను సాధించిన వ్యక్తి అని కూడా చూడకుండా, కనీసం కేసీఆర్ వయస్సు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ సీఎం హోదాలో ఉన్నా వ్యక్తి ..గల్లీ లీడర్ కంటే దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినందుకు... అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌కు గోరీ కడతావా? అని ప్రశ్నించారు. అధికార మధంతో ఇలానే మాట్లాడితే తెలంగాణ ప్రజలు నాలుక చీరేస్తారని హెచ్చరించారు. ఇకనైనా.. రేవంత్ రెడ్డి తన మాట తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ వాళ్లకు కోపం వస్తే అయిదేళ్ల లోపే ముఖ్యమంత్రిగా దించేస్తారని హెచ్చరించారు. కేసీఆర్ కంటే మంచి పాలన అందించడంలో పోటీ పడాలని సీఎంకు సూచించారు.