కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
హైదరాబాద్:Congress పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. Dasoju Sravan కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నుండి కార్పోరేటర్ విజయం సాధించిన పి. విజయారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై శ్రవణ్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
దాసోజు శ్రవణ్ తొలుత టీఆర్ఎస్ లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో టీఆర్ఎస్ పార్టీలో దాసోజు కీలకంగా వ్యవహరించారు. 2014 ఏప్రిల్ 12న దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేష్, అప్పటి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన దాసోజు శ్రవణ్ ను అధికార పార్టీ ప్రతినిధిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ.
undefined
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని దాసోజు శ్రవణ్ ఆశించారు. అయితే దాసోజు శ్రవణ్ కు టీఆర్ెస్ నాయకత్వం టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైన తర్వాత కూడా ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రవణ్ కుమార్ పనిచేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుండి గతంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన విజయారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. విజయారెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి కార్పోరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు. గత మాసంలో విజయారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయారెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీఎల్పీ నేతగా పనిచేసిన పీజేఆర్ కూతురు.
విజయారెడ్డి చేరికను శ్రవణ్ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ విషయమై తనతో చర్చించలేదనే అసంతృప్తి కూడా శ్రవణ్ తన అనుచరులతో వ్యక్తం చేసినట్టుగా సమాచారం. విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు గాంధీ భవన్ కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ విజయారెడ్డి పార్టీలో చేర్చుకోవడంతో వచ్చే ఎన్నికల్లో తనకు ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందో లేదోననే అనుమానం కూడా శ్రవణ్ కు ఉందనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోదాసోజు శ్రవణ్ తో పాటు రేవంత్ రెడ్డి బంధువు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు విజయారెడ్డి కూడా పార్టీలో చేరారు. ఈ కారణాలన్నింటితో శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా పార్టీ నియమించిన సమయంలో దాసోజు శ్రవణ్ స్వాగతించారు.ట్విట్టర్ వేదికగా ఆయన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అయితే శ్రవణ్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనే విషయమై త్వరలోనే తేలనుంది. దాసోజు శ్రవణ్ ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.