
అధికార పార్టీ ఎంపి డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ పై నిజామాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలసిందే. తన అన్నపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై బిజెపి నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. తనకు సంజయ్ తో ఎలాంటి సంబంధం లేదంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.
సంజయ్ నిజంగానే యువతులను వేధించినట్లు నిరూపణ అయితే అతడిని కఠినంగా శిక్షించాలన్నారు. తనకు తన తండ్రి, సోదరుడితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తండ్రి డీఎస్ నే ఎదిరించి బిజెపిలోకి చేరానని అరవింద్ అన్నారు.
ఎవరు ఏ పార్టీలో ఉండాలన్నది వారి వారి ఇష్టాలతో ముడిపడి ఉంటుందని అరవింద్ వ్యాఖ్యానించారు. తండ్రి, సోదరుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికి తాను బిజెపిలో చేరడం తన వ్యక్తిగతమని అన్నారు. సంజయ్ పై కేసు గురించి ఓ సామాన్యుడి మాదిరిగానే తానూ స్పందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇక అరవింద్ అధికార టీఆర్ఎస్ పార్టీ పాలనపై ద్వజమెత్తారు. కేవలం గజ్వెల్ , సిద్దిపేట ప్రజలు, రైతులు బాగుంటే చాలా? అంటూ ప్రశ్నించారు.ఎంపి కవితకు నిజామాబాద్ జిల్లా పై ప్రేమే లేదని రాజకీయాల కోసమే ఆమె తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కవితకు అసలు చిత్తశుద్ధే లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ బుద్ధి చెబుతారని అరవింద్ హెచ్చరించారు.