
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా పొరుగునే వున్న మహారాష్ట్రలో కేసులు తీవ్రస్థాయిలో వుండటంతో అప్రమత్తమైంది.
మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో కరోనా కేసులతో ప్రమాదకర సూచనలు కనబడుతున్నాయి. సలాబత్ పూర్, సాలూరా, కందకుర్తి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు.
మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా థర్మల్ స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ రోజుకు 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లుగా అధికారులు తెలిపారు.
పాజిటివ్ వచ్చిన వారిని వైద్య సిబ్బంది తెలంగాణలోకి రానివ్వకుండా వెనక్కి పంపేస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరాఠా రోగులు క్యూ కడుతున్నట్లుగా సమాచారం. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తిగా పరిశీలించాకే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు.