నియోజకవర్గం నుంచి 100 మందికి దళితబంధు.. ఎమ్మెల్యేల చేతికి లబ్దిదారుల ఎంపిక బాధ్యత ?

By team telugu  |  First Published Dec 24, 2021, 9:55 AM IST

ఇప్పటి వరకు కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన దళితబంధు పథకం ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే లబ్దిదారుల ఎంపిక, విధివిధానాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. 


ద‌ళితబంధు ప‌థ‌కాన్ని రాష్ట్రమంతా అమ‌లు చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందింస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం, సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామ‌మైన వాసాల‌మ‌ర్రి గ్రామంలో మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌రో నాలుగు నియోజ‌క‌వర్గాల్లోని నాలుగు మండ‌లాల్లోనూ దీనిని అమ‌లు చేసేందుకు నిధులు విడుద‌ల చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో దీనిని అమ‌లు చేసేందుకు సిద్ధమ‌వుతోంది. 

ఎమ్మెల్యేల‌కు కీలక బాధ్య‌త‌లు..
ద‌ళితబంధు ప‌థ‌కాన్ని జిల్లాల వారీగా కాకుండా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అమ‌లు చేయాలని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసే కీల‌క బాధ్య‌త‌ల‌ను కూడా ఎమ్మెల్యేల‌కే అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తీ నియోజ‌వ‌ర్గంలోని 100 మంది అర్హులైన ద‌ళితుల‌ను ఎంపిక చేసి, వారి వివ‌రాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని సూచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ద‌ళిత‌బంధుకు అర్హులెవ‌రూ, వారిని ఏ విధంగా గుర్తించాలి, నిబంధ‌న‌లు ఏంటి అనే విష‌యాల‌ను తేల్చేందుకు ఎస్సీ కార్పొరేష‌న్ సిద్ధ‌మ‌వుతోంది. ఆ శాఖ సూచించిన విధంగా ఎమ్మెల్యేలు ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. 

Latest Videos

undefined

శిల్పా చౌదరికి బెయిల్:చంచల్‌గూడ జైలు నుండి విడుదల

ఆ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు దళిత బంధు నిధుల‌ జ‌మ‌..
హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం, సీఎం ద‌త్త‌త గ్రామం వాసాలమ‌ర్రిలో ద‌ళిత‌బంధు ప‌థ‌కం ఇప్ప‌టికే అమ‌లు అవుతోంది. వీటిని రాష్ట్ర ప్ర‌భుత్వం పైలెట్ ప్రాజెక్టుగా భావించింది. అయితే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఈ ప‌థ‌కాన్ని మ‌రో నాలుగు మండ‌లాల‌కు విస్త‌రించారు. ఆ నాలుగు మండ‌లాల్లో కూడా ఈ పైలెట్ ప్రాజెక్ట్ ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇందులో  సూర్యాపేట‌, నాగ‌ర్‌క‌ర్నూల్, కామారెడ్డి, ఖ‌మ్మం జిల్లాలో ప‌రిధిలో వ‌చ్చే నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాలుగు మండ‌లాలు ఉన్నాయి. అయితే అక్క‌డ ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన‌ప్పటికీ నిధుల‌ను మాత్రం విడుద‌ల చేయ‌లేదు. దీంతో అక్క‌డ ఆ ప‌థ‌కం అమ‌లుకు బ్రేక్ ప‌డింది. దీంతో ఆయా మండ‌లాల్లో ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు కోసం గ‌త మంగ‌ళ‌వారం నిధుల‌ను విడుద‌ల చేసింది. మొత్తం రూ. 250 కోట్ల‌ను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల ఖాతాల్లో జ‌మ చేసింది. దీంతో అక్క‌డ ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. 
ద‌ళితబంధు ప‌థ‌కంపై వ‌చ్చిన‌న్ని విమ‌ర్శ‌లు దేనిపైనా రాలేదు. దీనికి కార‌ణాలు ఉన్నాయి. స‌రిగ్గా హుజూరాబాద్ ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ ప్ర‌భుత్వం దీనిని ప్ర‌క‌టించింది. అది కూడా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామ‌ని చెప్పింది. తెలంగాణ ప్ర‌భుత్వం ఏ కొత్త ప‌థ‌కం ప్రారంభించినా.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోనే ప్రారంభిస్తుందని, గ‌తంలో కూడా హుజూరాబాద్ నుంచి కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టామ‌ని, ఇది ఒక సంప్రాద‌యంగా వ‌స్తోంద‌ని తెలిపారు. అందులో భాగంగానే ఈ ప‌థ‌కం కూడా హుజూరాబాద్ లోనే పైలెట్ ప్రాజెక్టుగా అమ‌లు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పారు. దీనిపై తీవ్రంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. హుజురాబాద్‌లో 50 వేల‌కు పైగా ద‌ళితుల ఓట్లు ఉన్నాయ‌ని, వారి ఓట్ల కోసమే అక్క‌డ ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తుంగ‌తుర్తి,  మధిర, జుక్కల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలోని ఓ మండ‌లంలో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని చెప్పింది. 
 

click me!