గులాబ్ తుఫాను (Cyclone Gulab) ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్: గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు.
వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ప్రజలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, అమీర్ పేట, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జిహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి.
Also Rad: తీరాన్ని తాకిన గులాబ్ తుఫాన్.. మరో 3 గంటల పాటు ముప్పే, వణుకుతున్న ఉత్తరాంధ్ర
భారీ వర్షాలతో హైదరాబాదు రోడ్లున్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదులో జిహెచ్ఎంసీ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 040-23202813 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని జిహెచ్ఎంసీ సూచించింది.
తెలంగాణపై కూడా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోది. మహబూబాబాద్ లోని ప్రభుత్వాస్పత్రిలో పైకప్పు పెచ్చులూడింది. అయితే ప్రమాదం ఏదీ సంభవించలేదు. తెలంగాణలో 1 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏడు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.