Cyclone Gulab: నేడు తెలంగాణలో భారీ వర్షాలు... ఆ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Sep 28, 2021, 9:39 AM IST
Highlights

గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఇవాళ(మంగళవారం) కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హైదరాబాద్: గులాబ్ తుఫాను ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆది, సోమవారాలు తెలంగాణ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(మంగళవారం) కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు, మిగతాచోట్ల సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల  జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం కూడా రెండు రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. అయితే ఇవాళ కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు... కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది. దీంతో నగర ప్రజలతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.  

నగరంలో లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికోసం 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే 170 మాన్సూన్‌ టీమ్‌లు, 92 స్టాటిస్టిక్స్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధంచేసింది. రిజర్వ్‌ పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.

read more  గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో కుండపోత,లోతట్టు ప్రాంతాలు జలమయం

ఇక గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో 17.02 సెం.మీ, నిజామాబాద్ జిల్లా సిరికొండలొ 16.6సెం.మీ, కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 15.7సెం.మీ, ఖమ్మం జిల్లా ఇచ్చోడలో 15.15 సెం.మీ,  వర్షపాతం నమోదైంది.

గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైద్రాబాద్ నగరంలో కూడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడ  పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.  

click me!