Cyclone Gulab: రెస్క్యూ బృందాలు అందుబాటులో..: కలెక్టర్లకు విద్యుత్ మంత్రి దిశానిర్దేశం

By Arun Kumar PFirst Published Sep 28, 2021, 12:27 PM IST
Highlights

గులాబ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహాయక చర్యల మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్లకు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్: గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మంత్రి నల్లగొండ,సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిలను సమీక్షించారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాలతో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేలా చర్యలు తీసుకునేలా విద్యుత్ శాఖను అలెర్ట్ చేయాలని ఆయన కలెక్టర్లకు చెప్పారు. అదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ తో పాటు రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని మంత్రి జగదీష్ రెడ్డి కలెక్టర్లు ఆదేశించారు.

గులాబ్ తుఫాను ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆది, సోమవారాలు తెలంగాణ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(మంగళవారం) కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు, మిగతాచోట్ల సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మంత్రులు అప్రమత్తం చేస్తున్నారు.  

read more  cyclone gulab: తెలంగాణలో కుండపోత, స్థంభించిన జనజీవనం, రాకపోకలు బంద్

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిందని... ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కరీంనగర్ జిల్లా ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఎక్కువగా ఇళ్లలోనే వుండటానికి ప్రయత్నించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అధికారులతో మంత్రి గంగుల కూడా హైదరాబాద్ నుండి ఫోన్లో మాట్లాడారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం కూడా రెండు రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. అయితే ఇవాళ కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు... కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది. దీంతో నగర ప్రజలతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.  
 

click me!