విజృంభిస్తోన్న కరోనా.. ఫంక్షన్లకు దూరంగా వుండండి: ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి

By Siva KodatiFirst Published Apr 9, 2021, 6:11 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సీపీ కోరారు

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సీపీ కోరారు. ఇక నుంచి ఫంక్షన్లకు సైతం దూరంగా వుండాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ప్రజలు గుంపులు గుంపులుగా వుండొద్దని.. ఫస్ట్ కంటే సెకండ్ వేవ్ కరోనా ప్రమాదకరమైనదని సజ్జనార్ పేర్కొన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఫ్లాస్మా దాతలు ముందుకు రావాలని సజ్జనార్ పేర్కొన్నారు. 

అంతకుముందు కోవిడ్ వ్యాప్తి నివారణపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైసేషన్ తదితర కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు.

Also Read:తెలంగాణలో కరోనా వ్యాప్తి... పోలీసులకు డిజిపి కీలక ఆదేశాలు

కోవిడ్ రెండవ విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున దీని నివారణకు మరోసారి పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహాయ సహాకారాలతో కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేసుకోవడం, మాస్క్ లను ధరించడం తదితర నివారణ చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.

ఇదిలావుంటే తెలంగాణలో తాజాగా గత 24గంటల్లో (బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) 1,01,986మందికి కరోనా టెస్టులు చేయగా 2478మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,21,182కు చేరితే టెస్టుల సంఖ్య 1,07,61,939కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 363మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,03,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 9,674గా వుంది.  
 

click me!