Telangana elections: 521 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు.. స‌గం మంది ఆ మూడు పార్టీల వారే..

By Mahesh Rajamoni  |  First Published Nov 25, 2023, 5:11 PM IST

Telangana Elections 2023: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థుల వివ‌రాల‌ను విశ్లేషించగా, వారిలో 521 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అయితే, వీరిలో దాదాపు స‌గం మంది ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్య‌ర్థులే కావ‌డం గ‌మ‌నార్హం.


Telangana Assembly Elections 2023: ఈ ఏడాది జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల్లో 521 మంది అభ్యర్థులు త‌మ‌పై క్రిమినల్ కేసులు న‌మోద‌య్యాయ‌నీ పేర్కొన్నారు. వారిలో అధికంగా రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ కు చెందిన‌వారే ఉన్నారు. అధికంగా 85 మంది కాంగ్రెస్ అభ్యర్థులు క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,290 మంది అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను విడుదల చేశాయి. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 355 మంది జాతీయ పార్టీలు, 175 మంది రాష్ట్ర పార్టీలు, 771 మంది రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలు, 989 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. 

521 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు..

Latest Videos

undefined

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2290 మంది అభ్యర్థుల్లో 521 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 353 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 1,777 మంది అభ్యర్థుల్లో 368 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.  231 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 118 మంది అభ్యర్థుల్లో 85 మంది, బీజేపీ నుంచి పోటీ చేసిన 111 మంది అభ్యర్థుల్లో 79 మంది, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన 119 మంది అభ్యర్థుల్లో 57 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. బీఎస్పీకి చెందిన 107 మంది అభ్యర్థుల్లో 40 మంది, సీపీఎం నుంచి 19 మంది అభ్యర్థుల్లో 12 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది అభ్యర్థుల్లో 10 మంది, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు చెందిన 9 మంది అభ్యర్థుల్లో ఐదుగురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 118 మంది అభ్యర్థుల్లో 60 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థుల్లో 54 మంది, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన 119 మంది అభ్యర్థుల్లో 34 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీఎస్పీకి చెందిన 107 మంది అభ్యర్థుల్లో 28 మంది, సీపీఎం నుంచి 19 మంది అభ్యర్థుల్లో ఆరుగురు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది అభ్యర్థుల్లో ఏడుగురు, ఎంఐఎం నుంచి పోటీ చేసిన తొమ్మిది మంది అభ్యర్థుల్లో ముగ్గురు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.

మహిళలపై నేరాలు, అత్యాచార ఆరోపణలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన 45 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించగా, వారిలో ముగ్గురు అత్యాచారానికి సంబంధించిన కేసులను ప్రకటించారని నివేదిక హైలైట్ చేసింది. ఏడుగురు అభ్యర్థులు తమపై హత్యకు సంబంధించిన కేసులు, 27 మంది అభ్యర్థులు హత్యాయత్నానికి సంబంధించిన కేసులను ప్రకటించుకున్నారని నివేదిక పేర్కొంది.

96 రెడ్ అల‌ర్ట్ నియోజ‌క‌వ‌ర్గాలు.. 

అలాగే 119 నియోజకవర్గాల్లో 96 నియోజకవర్గాలు రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు అని నివేదిక పేర్కొంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని పేర్కొన్న నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజ‌క‌వ‌ర్గాలుగా పేర్కొంటున్నారు.  2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 78 నియోజకవర్గాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు. 

click me!