అప్పుడు మా సపోర్ట్‌తో అధికారంలోకి .. మాకే సుద్ధులు చెబుతారా : డీకే శివకుమార్‌కు కేసీఆర్ కౌంటర్

By Siva Kodati  |  First Published Oct 29, 2023, 4:44 PM IST

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి మనకు సుద్ధులు చెబుతున్నారని.. మనతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు . స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేయలేదని సీఎం ఎద్దేవా చేశారు.  


కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి మనకు సుద్ధులు చెబుతున్నారని.. మనతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారం కోసం ఆవురావురుమంటోందని ఆయన చురకలంటించారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఆదివారం తుంగతుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని పార్టీల వైఖరి, చరిత్ర, ప్రజలకు తెలుసునని కేసీఆర్ తెలిపారు. గతంలో తుంగతుర్తి నుంచి వలసలు చూసి కన్నీళ్లు వచ్చేవని సీఎం అన్నారు. గోదావరి జలాలను పట్టుబట్టి తుంగతుర్తికి తెచ్చుకున్నామని.. ఇప్పుడు తుంగతుర్తిని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతోందన్నారు. 

తుంగతుర్తిలో మరికొన్ని ప్రాంతాలకు నీళ్లు రావాల్సి వుందని.. గులాబీ జెండా పుట్టుకముందు తెలంగాణ హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే నక్సలైట్లు అని జైలులో వేసేవారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్నానని సీఎం వెల్లడించారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని.. ప్రాణాలను బలి తీసుకుని తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేవాదుల నీళ్లు రావాల్సి వుంది.. ఆ పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. తాను ఆమరణ నిరాహారదీక్ష చేపడితే రాష్ట్రాన్ని ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకున్నారని కేసీఆర్ వెల్లడించారు. 

Latest Videos

దశలవారీగా కళ్యాణలక్ష్మీ, పెన్షన్‌ను పెంచుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఆనాడు చెంచాగిరి చేసినోళ్లు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారని విపక్షాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రానున్న రోజుల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం జైళ్లో పెట్టిందని కేసీఆర్ గుర్తుచేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో లేని వారు నేడు మాట్లాడుతున్నారని.. సభల్లో చెప్పిన విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ప్రజలకు సంక్షేమ పథకాలు పెంచుతున్నామని.. రైతు బంధు పథకాన్ని తేవాలని ఏ ప్రభుత్వం ఆలోచించలేదని సీఎం దుయ్యబట్టారు. 

తుంగతుర్తి పోరాటాల గడ్డ అని.. ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం కనికరం చూపించలేదన్నారు. తెలంగాణ రాకముందు వలసలు, ఆకలి చావులు వుండేవన్నారు. తలసారి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో వుందని.. తలసారి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో వుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని.. యూపీలో ప్రజలకు అన్నానికి దిక్కులేదని సీఎం ఎద్దేవా చేశారు. యూపీ సీఎం వచ్చి తెలంగాణకు పాఠాలు చెబుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ సాధిస్తానని తన మీద ఎవరికీ నమ్మకం లేదన్నారు. దేశంలోనే తొలిసారిగా అల్ట్రా పవర్‌ ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. 

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేయలేదని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కృషి చేసి వుంటే దళితులు ఇంత దారుణ పరిస్ధితుల్లో వుండేవారా అని కేసీఆర్ ప్రశ్నించారు. గాదరి కిశోర్ కుమార్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. రైతుబంధును వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారని కేసీఆర్ గుర్తుచేశారు. బస్వాపూర్ ప్రాజెక్ట్  నుంచి నీళ్లు రాబోతున్నాయని సీఎం వెల్లడించారు. యూపీ, బీహార్ నుంచి వరినాట్లు వేయడానికి తెలంగాణకు వస్తున్నారని కేసీఆర్ తెలిపారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలున్నారా అని ఆయన ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

click me!