బిజెపి వ్యతిరేక ఓట్లు చీల్చడమే కేసీఆర్ స్ట్రాటజీ... అందుకే తేజస్వి యాదవ్ అలా..: సిపిఎం తమ్మినేని సంచలనం

By Arun Kumar PFirst Published Jan 26, 2022, 4:08 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపితో పోరాటంతో విఫలమయ్యారని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బిజెపియేతర పార్టీలను ఏకం చేయడంతో కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ (TRS), ప్రతిపక్ష బిజెపి (BJP) ల మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న సమయంలో సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (tammineni veerabhadram) కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బిజెపికి వ్యతిరేకంగా పోరాడటంలో విఫలమయ్యారని తమ్మినేని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోన్న బిజెపితో పోరాడతున్నామంటూనే ఆ పార్టీకి లాభం చేకూర్చేలా టీఆర్ఎస్ చర్యలున్నాయని తమ్మినేని అన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాటజీ బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే బీజేపీకి సహాయం చేస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. ఈ అంశంపై అల్ ఇండియా మహాసభలో చర్చిస్తాం. అలాగే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపైనా చర్చిస్తాం'' అని తమ్మినేని తెలిపారు. 

''ఆర్జేడీ పార్టీ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఇటీవల కేసీఆర్ ని కలిసారు. ఈ సమయంలోనే బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇదే అభిప్రాయం దేశంలోని అనేక పార్టీలకు వున్నట్లు తెలుస్తోంది.  కాబట్టి బీజేపీ ఏతర అన్ని పార్టీలను ఏకం చేయడం కాంగ్రెస్ తోనే సాధ్యం'' అని కీలక వ్యాఖ్యలు చేసారు.

''ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఉగ్రదాడి అనేది పొలిటికల్ స్టంట్ భాగమే. పబ్లిసిటీ కోసమే ఈ ఉగ్రదాడి ప్రచారం జరిగింది. బిజెపికి ఇలాంటి పొలిటికల్ స్టంట్స్ కొత్తేమీ కాదు'' అని తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేసారు.

తెలంగాణలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ కేసీఆర్, బీజేపీ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. బిజెపికి లబ్ది చేకూర్చి కాంగ్రెస్ పార్టీని మరింతగా దెబ్బతీయాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని తమ్మినేని అనుమానం వ్యక్తం చేసారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల బిజెపి యేతర పార్టీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేతతో ఇటీవల భేటీ అయ్యారు. ఇలా బిజెపి వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్  ప్రయత్నిస్తున్న సమయంలో తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యలు రాజకీయం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇటీవల రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ (tejashwi yadav)తో కేసీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. తేజస్వి యాదవ్‌ బృందంలో సమాజ్ వాదీ పార్టీ నేతలు అబ్దుల్ బారీ సిద్దిఖీ, సునీల్ సింగ్, భోలా యాదవ్ ఉన్నారు.

కేసీఆర్, తేజస్వి యాదవ్ జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీలు పోషించాల్సిన పాత్రపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 

బిహార్ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్.. బీజేపీ వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా కొద్ది నెలలుగా బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలు అంశాల్లో కేంద్రం తీరుపై మండిపడుతున్న కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా వ్యుహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారు.  
 

 

click me!