ఎంపీ అర్వింద్‌పై దాడి.. మీ గుండా రాజకీయాలకు భయపడం: కేసీఆర్‌కు రాములమ్మ వార్నింగ్

Siva Kodati |  
Published : Jan 26, 2022, 02:30 PM IST
ఎంపీ అర్వింద్‌పై దాడి.. మీ గుండా రాజకీయాలకు భయపడం: కేసీఆర్‌కు రాములమ్మ వార్నింగ్

సారాంశం

బీజేపీ (bjp) ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ (dharmapuri arvind) వాహ‌నంపై దాడి జ‌ర‌గ‌డంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, పోలీసుల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ క్రమంలోనే విజ‌య‌శాంతి ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. 

బీజేపీ (bjp) ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ (dharmapuri arvind) వాహ‌నంపై దాడి జ‌ర‌గ‌డంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, పోలీసుల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ క్రమంలోనే విజ‌య‌శాంతి ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. 

''తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ (trs) సర్కార్... రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోంది.

ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత... లేకుంటే ఎంత? రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) ఒక్కటే హెచ్చరిక. దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే... వెన్నుచూపే ప్రసక్తే లేదు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంది. మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం'' అని రాములమ్మ ట్వీట్ చేశారు.

కాగా... పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంగళవారం నందిపేట వెళ్తున్న క్రమంలో ఎంపీ అర్వింద్ ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పసుపు బోర్డు ఎక్కడంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే నందిపేటకు వెళ్తున్న ఎంపీ అర్వింద్ ను, బీజేపీ కార్యకర్తలను  మామాడిపల్లి చౌరస్తా వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలతో కలిసి అర్వింద్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెర్కిట్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... ఎంపీ ల్యాడ్స్ నిధులతో నందిపేటలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే.. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవడం దుర్మార్గమని, కేంద్రం ఇచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేయ‌డం టీఆర్ఎస్  నేత‌లు ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. పర్యటన ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణుల యత్నించడంతో.. సీపీ నాగరాజుకు ఫోన్‌లో పరిస్థితిని వివరించినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. అయినా  స్పందన లేకపోవడంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్దికి టీఆర్ఎస్ అడ్డు పడుతున్నది.. తనకు కాదనీ ఎంపీ అర్వింద్ విమర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu