సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే ఇవాాళ కాస్త మెరుగుపడినట్లు హైదరాబాద్ ఏఐజి హాస్సిటల్ డాక్టర్లు తెలిపారు.
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ బిపి కాస్త మెరుగుపడిందని డాక్టర్లు చెబుతున్నారు. మెడిసిన్స్ కు ఆయన శరీరం స్పందిస్తోందని... ఆరోగ్యం మరింత మెరుగుపడితే వెంటిలేటర్ తొలగిస్తామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసియులో వుంచి చికిత్స అందిస్తున్నామని... లంగ్స్ లో చేరిన నీటిని తొలగిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
గత సోమవారం ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం తెల్దారుపల్లిలో వుండగా తమ్మినేని అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమంగా వుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయనను గచ్చబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కు తరలించారు.
గుండె సంబంధిత సమస్యతో పాటు కిడ్నీలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తమ్మినేని వీరభద్రం పరిస్థితి ఆందోళనకరంగా వుందని డాక్టర్లు గుర్తించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఏఐజి డాక్టర్లు చెబుతున్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలెవరూ హాస్పిటల్ వద్దకు రావద్దని ఏఐజి హాస్పిటల్ సిబ్బంది, తమ్మినేని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను బయటపెడతామని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్: సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఇప్సటికే మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏఐజి హాస్పిటల్లో తమ్మినేని కుటుంబసభ్యులను పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని మంచి వైద్యం అందించాలని సూచించారు. తమ్మినేని కుటుంబసభ్యులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు.