
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం నాడు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీజేఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా(maha dharna) నిర్వహించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం కేంద్రానికి పరిపాటిగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.కార్పోరేట్ రంగంలోని తనకు సన్నిహితులకు మోడీ సర్కార్ కారుచౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టే ప్రయత్నిస్తోందన్నారు.
తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఆరోపించారు.కరోనాతో మరణంతో పలు కుటుంబాలు చిన్నాభిన్నామయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.