వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లెఫ్ట్ పార్టీలు ఇవాళ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం నాడు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కలిసి పనిచేయాలని నిర్ణయిం తీసుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని గతంలో ప్రకటించాయి. అయితే బీఆర్ఎస్ నాయకత్వం నుండి ఈ పార్టీలకు సానుకూల స్పందన రాలేదని లెఫ్ట్ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా సీపీఐ నాయకత్వం ఈ విషయమై బీఆర్ఎస్ నాయకత్వంపై ఆగ్రహంతో ఉంది. బీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు చేసిన ప్రకటనలు లెఫ్ట్ పార్టీల నాయకత్వాన్ని ఇబ్బందికి గురి చేశాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉంటే సీపీఐ, సీపీఎంలు పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. పొత్తు విషయమై చర్చించేందుకుగాను కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం లెఫ్ట్ నేతలు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే కేసీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా లెఫ్ట్ నేతలకు సమయం ఇవ్వలేదని సమాచారం.
బీఆర్ఎస్ తో పొత్తు లేకపోతే ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే విషయమై లెఫ్ట్ పార్టీ నేతలు చర్చించారు. రాష్ట్రంలోని ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై సీపీఐ, సీపీఎంల మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం.