గౌతమీపుత్ర, రుద్రమదేవీ మూవీలకు హైకోర్టు షాక్

First Published Mar 28, 2017, 11:38 AM IST
Highlights

వినోదపుపన్ను మినహాయింపు అనేది ఎవరికి వర్తించాలి. సినిమా తీసే నిర్మాతలకా, సినిమా చూసే ప్రేక్షకులకా ? ఈ విషయంపై క్లారిటీ కోసం ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు ఏమందంటే...

పన్ను కట్టేవారికే పన్ను మినహాయింపు ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకుడు కూడా తన టికెట్ మీద పన్ను చెల్లిస్తాడు. ప్రభుత్వం వినోదపు పన్నుపేరుతో ప్రేక్షకుల నుంచి ఈ టాక్స్ రాబడుతోంది.

అయితే ఇటీవల వరకు కొన్ని చిత్రాలకు ముఖ్యంగా మన సంస్కృతిని ప్రతిబింబించే, దేశభక్తిని బోధించే, చారిత్రక ప్రాధాన్య చిత్రాలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తోంది. అంటే వాటి మీద వినోదపు పన్ను ఉండదన్నమాట. ఇదంతా బాగానే ఉంది. వినోదపు పన్ను లేనప్పడు మరి ఆ సినిమా టికెట్ ధర బాగా తగ్గాలి కదా ... కానీ, అలా జరగడం లేదు.

 

ఎందుకంటే వినోదపు పన్ను మినహాయిస్తున్నది ప్రేక్షకుడికి కాదు. సినిమా నిర్మాతకు... అందువల్లే సినిమా టికెట్ ధర తగ్గడం లేదు. ఈ విషయంపై తాజాగా ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.  

 

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చారిత్రకప్రాధాన్యం కలిగిన గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవీ చిత్రాలు విడుదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ప్రభుత్వాలను కోరడంతో  వాటికి పన్ను మినహాయింపును ఇస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసింది.

 

అయితే వీటికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై  హైకోర్టులో ఓ వ్యక్తి పిల్ దాఖలు చేశారు. వినోదపు పన్ను మినహాయింపు ప్రేక్షకులకే చెందేలా ఆదేశించాలని పిటీషనర్‌ తన ఫిర్యాదులో కోరారు. గతంలో తమిళనాడు లో కోర్టు తీర్పును పిటిషనర్ తన పిల్‌లో ప్రస్తావించారు.

 

చరిత్ర తెలుసుకోవడాకి..చూడటానికి ప్రేక్షకులకు రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ నిర్మాతలకు ఇవ్వాల్సి ఉండేది కాదని పిటిషన్ లో పేర్కొన్నారు.

 

దీనిపై స్పందించిన కోర్టు  గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాతలతో పాటు హీరో బాలకృష్ణకు , రుద్రమదేవి సినిమా నిర్మాత గుణశేఖర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

click me!