కరోనా చికిత్సకు రూ. 10వేల లోపే ఖర్చు: ఈటల రాజేందర్

By narsimha lodeFirst Published Sep 11, 2020, 3:12 PM IST
Highlights

కరోనా చికిత్స కు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ పీజులు వసూలు చేయవద్దని తాను ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను మందలించానని ఆయన చెప్పారు.

హైదరాబాద్: కరోనా చికిత్స కు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ పీజులు వసూలు చేయవద్దని తాను ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను మందలించానని ఆయన చెప్పారు.

ఇవాళ శాసనమండలిలో కరోనాపై జరిగిన స్వల్పకాలిక చర్చపై మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. కరోనా సోకిన రోగులను ఐసీయూలో ఉంచితే రూ. 50 వేలు, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తే లక్ష రూపాయాలు దాటదని ఆయన చెప్పారు. 

కరోనా చికిత్స కోసం ఉపయోగించే డెక్సామెథసోన్ ట్యాబ్లెట్ ధర 13 పైసలే ఉంటుందన్నారు. రూ. 30 వేల కంటే ఎక్కువ ధర ఉండే రిమిడెసివర్ వంటి ఇంజక్షన్లను ప్రభుత్వాసుపత్రులకు పంపుతున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కట్టడికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే తమ ప్రయత్నాన్ని చూడకుండా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేస్తున్న వ్యాఖ్యలు బాధ పెట్టిస్తున్నాయన్నారు. 

ఏయ్ రాజేందర్.. అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం సరైంది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు తనను బాధించాయని ఆయన చెప్పారు. నేనేమైనా మీకు జీతగాడినా... ఎన్ని వందల కోట్లు తీసుకొన్నారని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కరోనాను నివారణలో తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని చెప్పారు. ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేయవద్దని ఆయన విపక్షాలకు సూచించారు. కరోనా కట్టడిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తరచుగా మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్పారు.కరోనా వారియర్స్ సేవలను ఆయన కొనియాడారు.  వైద్యులు , ఇతర సిబ్బందికి ప్రోత్సహకాలను పెంచాలని భావిస్తున్నామన్నారు. 

ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న కరోనా వార్డుల్లో బెడ్స్ ఎందుకు ఖాళీగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు తీసుకొంటామన్న ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

కరోనా వారియర్లకు మరో 6 నెలలు ప్రోత్సాహకాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యా ఎఏస్పీ దక్షిణామూర్తి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

click me!