ముగ్గురు వ్యాపారులకు కరోనా... మలక్ పేట్ మార్కెట్లో కలకలం

By Arun Kumar PFirst Published May 2, 2020, 11:01 AM IST
Highlights

మలక్ పేట మార్కెట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న సమయంలో గత గురువారం మళ్లీ కేసుల సంఖ్య పెరిగి ఆందోళన కలిగించింది. అంతకుముందు రెండుమూడు రోజులు సింగిల్ డిజిట్ కేసులే బయటపడటంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కేసులసంఖ్య పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య ఎక్కువగా వుండటంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.   

మలక్ పేట గంజ్ లో ముగ్గురు వ్యాపారులకు కరోనా సోకి అది వారి కుటుంబసభ్యులకు కూడా పాకింది. వ్యాపారులు ద్వారానే మరో పదిమంది కరోనాబారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కేవలం మలక్ పేట్ గంజ్ లోనే కాదు నగరంలోని అన్ని మార్కెట్లలో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు వీటిపై అంతగా దృష్టిపెట్టని అధికారులు ఇకపై అక్కడ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 

గ్రేటర్‌ పరిధిలోని అన్ని మార్కెట్లు, రైతుబజార్లతో పాటు ఇతర వ్యాపార కేంద్రాలన్నింటినీ తనిఖీ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆరుగురు జోనల్, 30 మంది డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలతో అధికారులు ప్రతినిత్యం మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు.  

మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వారితో పాటు పంటను తీసుకువచ్చే రైతులకు తప్పనిసరిగా పరీక్షించాలని... కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని క్వారంటైన్ కు గానీ హాస్పిటల్ కు గానీ తరలించాలని సూచించారు. ఇలాంటివారివల్ల కరోనా వ్యాపించకుండా తగినంత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమీషనర్ ఆదేశించారు. 

మార్కెట్లతో పరిశుభ్రత పాటించేలా పారిశుద్ద్యాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా వైరస్ నివారణకు నిత్యం అన్ని మార్కెట్లలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలని కమీషనర్ సూచించారు.   

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర పరిస్ధితులపై చర్చించేందుకు గాను ఈ నెల 5న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది.
 

click me!