తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు న్యూఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఖరారయ్యారు. ఇవాళ మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది.
గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఏడాది మే మాసంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడ ఆ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే వ్యూహారచన చేస్తుంది.రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది.ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు చేరారు. రానున్న రోజుల్లో మరికొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
హైద్రాబాద్ నగరంలోని ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించిన దానం నాగేందర్ ను సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలుంటాయనే విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ చర్చించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సునీల్ కనుగోలు నేతృత్వంలోని టీమ్ నిర్వహించిన సర్వే ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడ సునీల్ టీమ్ సర్వే ఫలితాలను కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.