Huzurabad bypoll result 2021: సీనియర్ల అస్త్రం ఇదే, రేవంత్ రెడ్డికి చిక్కులు

By Siva Kodati  |  First Published Nov 2, 2021, 4:45 PM IST

ఇప్పటి వరకు వున్న అక్కసును, అసంతృప్తిని తీర్చుకునేందుకు రేవంత్‌పై సీనియర్లు హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాన్ని అస్త్రంగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే పూర్తి ఫలితం రాక ముందే కోమటిరెడ్డి , జగ్గారెడ్డి వంటి నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండటం గమనించాల్సిన విషయం


రేవంత్ రెడ్డిని (revanth reddy) పీసీసీ (tpcc) చీఫ్‌గా నియమించిన నాటి నుంచి టీ కాంగ్రెస్‌లోని (t congress) సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన తమను కాదని.. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతకు పీసీసీ పదవి ఇవ్వడం పట్ల వారు గుర్రుగా వున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్టి (komati reddy venkat reddy) లాంటి నేతలైతే తాను గాంధీ భవన్‌లోకి అడుగుపెట్టేది లేదని శపథం చేశారు. ఆయన దారిలోనే మరికొందరు సీనియర్లు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. 

తమ సలహాలు తీసుకోకుండానే రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారని కొందరు సీనియర్లలో అసంతృప్తి ఉంది. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కు కూడా కొందరు నేతలు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు అధిష్టానం.. ఎఐసీసీలో కొంతమంది నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జాతీయాంశాలపై ఆందోళనలు చేపట్టేందుకు కమిటీని వేశారు సోనియా గాంధీ (sonia gandhi). కమిటీ ఛైర్మన్‌గా దిగ్విజయ్ సింగ్‎ను నియమించగా..ఈ సభ్యుల్లో ప్రియాంక గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మొన్నామధ్య జరిగిన దళిత గిరిజన దండోరా సమయంలోనూ తమకు ముందస్తు సమాచారం లేకుండా రేవంత్ రెడ్డి వేదికలను ప్రకటించడంపై కోమటిరెడ్డి అలిగారు కూడా. కానీ రేవంత్ స్పీడుతో ఆయను అడ్డుకునే రిస్క్ చేయలేక అవకాశం కోసం ఎదురుచూశారు.

Latest Videos

undefined

సరిగ్గా ఇలాంటి సమయంలోనే హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad bypoll) నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడే పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తన సత్తాను నిరూపించుకునేందుకు దీనిని వేదికగా చేసుకుంటారని అంతా భావించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. ఆయన ఉపఎన్నికను లైట్ తీసుకున్నారు. కొండా సురేఖను (konda surekha) బరిలోకి దించాలని రేవంత్ ఎంతో ప్రయత్నించారు. అయితే ఆమె పెట్టిన షరతులతో ఆయన ఖంగు తిన్నారు. దీంతో ఆమెను తప్పించి.. చివరి నిమిషంలో వెంకట్ బల్మూరిని బరిలోకి దించారు . సరిగ్గా నామినేషన్‌ల చివరి రోజున బల్మూరి వెంకట్ (venkat )నామినేషన్ వేశారు. నామినేషన్ ల సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ , జిల్లా కు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. అదే రోజు భారీ హంగామా చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఎన్నికల వ్యూహం పై సమావేశం ఏర్పాటు చేసుకొని పలు అంశాలపై చర్చించారు. మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు.

ALso Read:huzurabad by poll : డిపాజిట్ వస్తే రేవంత్ ఛరిష్మా, లేదంటే సీనియర్ల ఖాతాల్లోకే ... జగ్గారెడ్డి వ్యాఖ్యలు

ఇదంతా బాగానే ఉన్న ప్రచారం విషయంలో ముఖ్యనేతలు సైతం చడీచప్పుడు చేయలేదు. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత హుజురాబాద్ వైపు ఏ ఒక్క సీనియర్ నేత కన్నెత్తి చూడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట సభలు సమావేశాలంటూ తిరిగారు. అయితే ఆయన వెంట ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇలా ముఖ్య నేతలెవరూ హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడ లేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం ఉప ఎన్నికల వైపు చూడలేదు.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈరోజు మొదలైన ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో సీనియర్లు నిద్రలేచారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్‌కు మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు కోమటిరెడ్డి. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి ఉండేవని.. అలా జరిగితే టీఆర్‌ఎస్ లాభపడేదని వ్యాఖ్యానించారు. ఈటలకు పరోక్షంగా మద్దతిచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. వాస్తవ పరిస్ధితులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెంకట్ రెడ్డి అన్నారు. ఆ వెంటనే మరో సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ వస్తే అది  రేవంత్ ఖాతాలోకి..లేకుంటే సీనియర్ల ఖాతాలోకి వేసేందుకు కొందరు  రెడీ వున్నారంటూ వ్యాఖ్యానించారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు 61 వేల ఓట్ల పైచిలుకు ఓట్లు లభించాయి. తాజా ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవదన్న విషయం  తెలిసిందే. కానీ కనీస పోటీ ఇవ్వకుండా.. ప్రత్యర్ధి మెజారిటీనైనా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని రేవంత్‌పై ప్రచారం మొదలయ్యే అవకాశం వుంది. దీనికి తోడు ఈటల రాజేందర్‌కు లోపాయికారిగా మద్ధతు ప్రకటించారని టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీనియర్లు ఆధారంగా వుంచుకునే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద చూస్తుంటే ఇప్పటి వరకు వున్న అక్కసును, అసంతృప్తిని తీర్చుకునేందుకు రేవంత్‌పై సీనియర్లు హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాన్ని అస్త్రంగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే పూర్తి ఫలితం రాక ముందే కోమటిరెడ్డి , జగ్గారెడ్డి వంటి నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండటం గమనించాల్సిన విషయం. ఈ పరిణామాల నేపథ్యంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ దుస్థితికి రేవంత్‌ రెడ్డే కారణమని ప్రొజెక్ట్ చేసి అధిష్టానం దృష్టిలో ఆయన ప్రతిష్టను బద్నాం చేయాలనే ప్రయత్నాలు మొదలైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిని రేవంత్ ఎలా తిప్పికొడతారో వెయిట్ చేయాల్సిందే. 

click me!